Share News

Ponnam Prabhakar On BC Reservations: బీసీ రిజర్వేషన్లు ఎవ్వరికీ వ్యతిరేకం కాదు..

ABN , Publish Date - Oct 02 , 2025 | 03:07 PM

గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో 50% క్యాప్ తెస్తే ప్రత్యేక సమావేశల ద్వారా ఆ క్యాప్ తొలగిస్తూ చట్టం చేసి గవర్నర్ దగ్గరకు పంపించడం జరిగిందని మంత్రి పొన్నం అన్నారు. గవర్నర్ దానిని ఆమోదించలేదని.. ఆ బిల్లును ఆమోదించాల్సి ఉందన్నారు.

Ponnam Prabhakar On BC Reservations: బీసీ రిజర్వేషన్లు ఎవ్వరికీ వ్యతిరేకం కాదు..
Ponnam Prabhakar On BC Reservations

సిద్దిపేట, అక్టోబర్ 2: హుస్నాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శివాలయం వద్ద జరుగుతున్న శమీ పూజలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆపై ఇటీవల గ్రూప్‌లో ఉద్యోగాలు సాధించిన ముగ్గురు అభ్యర్థులను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి జరుపుకుంటామన్నారు. ‘చెడుపై మంచి గెలవాలి.. మీ అందరికీ శుభం కలగాలి’ అని ఆకాంక్షించారు.


హుస్నాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలని అన్నారు. ప్రభుత్వానికి మరింత బలం ఇవ్వాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. మంచి వర్షాలతో పాడిపంటలతో ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ప్రజలు ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెబుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. కరీంనగర్ జిల్లాలో ప్రాముఖ్యమైన గిద్దె పెరుమాండ్ల ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. శాసనసభలో బలహీన వర్గాల బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయని అన్నారు.


గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో 50% క్యాప్ తెస్తే ప్రత్యేక సమావేశల ద్వారా ఆ క్యాప్ తొలగిస్తూ చట్టం చేసి గవర్నర్ దగ్గరకు పంపించడం జరిగిందని అన్నారు. గవర్నర్ దానిని ఆమోదించలేదని.. ఆ బిల్లును ఆమోదించాల్సి ఉందన్నారు. శాసనసభలు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలన్నీ కోర్టులో బలహీన వర్గాల రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని అఫిడవిట్లు సమర్పించాలన్నారు. శాసనసభలో ఏకాభిప్రాయంతో బలహీన వర్గాల రిజర్వేషన్ల పెంపుకు మద్దతు తెలిపామని కోర్టుకు తెలపాలని మంత్రి డిమాండ్ చేశారు.


తెలంగాణ సమాజం గమనిస్తోందని.. తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారన్నారు. తెలంగాణ శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంపూర్ణ మద్దతు తెలిపారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై తాము ఎక్కడా నిరసన తెలపడం లేదని.. సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారన్నారు. ఒకవైపు అలుముకుంటూనే కడుపులో కత్తులు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్ని రకాల చర్యలు తీసుకుని న్యాయపరమైన అంశాలపై కూడా ముందుకు వెళ్లిందన్నారు. సజావుగా ఎన్నికలు సాగడానికి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని మంత్రి పేర్కొన్నారు.


దేశానికే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇవి రాష్ట్రానికి సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికలని.. సామాజిక న్యాయం జరగాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బలహీన వర్గాల విషయంలో భిన్న అభిప్రాయాలు ఉన్న పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో ముందుకు వచ్చాయన్నారు. ‘దేవాలయ ప్రాంగణం నుండి పిటిషనర్‌ను కోరుతున్న. బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఎవరికి వ్యతిరేకం కాదు. రాజ్యాంగంలో చట్టంలో ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. న్యాయం సామాజిక కోణంలో ఉంది. 2018లో ఉన్న పరిమితి ఎత్తివేసి చట్టం చేశాం.. అవి ఏం అడ్డంకులు కావు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం

రైతు మరింత విజయాలు సాధించాలి: హరీష్ రావు

Read latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2025 | 03:19 PM