Bonded Labor Rescue: వెట్టి చాకిరీ నుంచి 14 మందికి విముక్తి
ABN , Publish Date - Oct 18 , 2025 | 03:59 PM
సరిగ్గా భోజనం పెట్టకుండా తిడుతూ, కొట్టి పనిచేయిస్తున్నారని, చెరువులో చేపలు పట్టడం అని తీసుకువచ్చి నదిలో పట్టిస్తున్నారని కార్మికులు వాపోయారు.
నాగర్‌కర్నూలు, అక్టోబర్ 18: జిల్లాలోని అమరగిరిలోని కృష్ణానదిలో వెట్టిచాకిరి చేస్తున్న 14 మంది వలస కార్మికులకు విముక్తి కలిగింది. నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ కౌన్సిల్, మానవ అక్రమ రవాణా సంస్థ, కొల్లాపూర్ పోలీసులు మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. ఒరిస్సా, ఏపీ రాష్ట్రాలకు చెందిన 14 మంది లేబర్లను గుర్తించి వారిని స్వస్థలాలకు పంపేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. సరిగ్గా భోజనం పెట్టకుండా తిడుతూ, కొట్టి పనిచేయిస్తున్నారని, చెరువులో చేపలు పట్టడం అని తీసుకువచ్చి నదిలో పట్టిస్తున్నారని కార్మికులు వాపోయారు. వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించిన అధికారులకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వ్యవహారంపై అధికారులు మీడియాతో మాట్లాడుతూ... అమరగిరిలోని కృష్ణానదిలో ఆంధ్ర, ఓరిస్సా నుంచి లేబర్లను తీసుకొచ్చి నిర్భంధిచారని డిస్ట్రిక్ లీగల్ సర్వీస్ అథారిటీకి చెందిన మెజిస్ట్రేట్‌కు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారని చెప్పారు. మెజిస్ట్రేట్, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఒరిస్సాకు చెందిన 11 మంది కార్మికులు, విశాఖకు చెందిన ముగ్గురు కార్మికులను వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించామని తెలిపారు. కార్మికులను వారి స్వగ్రామాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విచారణ అనంతరం కార్మికులను బలవంతంగా తీసుకువచ్చినట్లు నిర్ధారణ అయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
కార్మికుల మాటల్లో...
చెరువులో చేపలు పట్టాలని తీసుకువచ్చారని ఇబ్బందులకు గురిచేసినట్లు కార్మికులు తెలిపారు. వేరే పని ఇస్తామని నమ్మబలికి ఇక్కడకు తీసుకువచ్చి వెట్టి చాకిరీ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేయకపోతే తిట్టే వారని, హింసించే వారిన కార్మికులు వాపోయారు.
ఇవి కూడా చదవండి..
పోక్సో కేసుల పరంపర.. తల్లిదండ్రుల ఆందోళన
పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్యకు కేటీఆర్ అండ
Read Latest Telangana News And Telugu News