KTR Help Mogulaiah: పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్యకు కేటీఆర్ అండ
ABN , Publish Date - Oct 18 , 2025 | 03:14 PM
కేటీఆర్‌ను కలిసిన మొగులయ్య తన కంటిచూపు మందగించిందని, చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మాజీ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
హైదరాబాద్, అక్టోబర్ 18: ఇంటి స్థల సమస్య, ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు (Mogulaiah) మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR) అండగా నిలిచారు. ఈరోజు (శనివారం) కేటీఆర్‌ను మొగులయ్య కలిశారు. ఈ సందర్భంగా తన సమస్యను మాజీ మంత్రికి వివరించారు మొగులయ్య. తాను కట్టుకున్న ఇంటి గోడలను కబ్జాదారులు కూల్చి వేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు గత ప్రభుత్వం ఇచ్చిన భూమిని కాపాడి తమ కుటుంబానికి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మొగులయ్య ఆరోగ్యం, యోగక్షేమాల గురించి కేటీఆర్ ఆరా తీశారు. కంటి చికిత్స చేయిస్తానంటూ హామీ ఇచ్చారు.
కేటీఆర్‌ను కలిసిన మొగులయ్య తన కంటిచూపు మందగించిందని, చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. మొగులయ్యకు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్‌లో పూర్తి చికిత్సను అందించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం గత ప్రభుత్వం తనకు హయత్‌నగర్ మండలంలో కేటాయించిన 600 గజాల స్థలం విషయంలో కొంతమంది వ్యక్తుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు, కోర్టు కేసుల వివరాలను కేటీఆర్‌కు మొగులయ్య వివరించారు.
తాను కట్టుకున్న గోడలను, ఇంటిని కూడా కూలగొట్టారని, కోర్టు కేసులు వేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు గత ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని కాపాడాలని కేటీఆర్‌ను కోరారు. అనేకసార్లు కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ తనకు పరిష్కారం దొరకలేదని, తనకు అండగా నిలవాలని మొగులయ్య కోరారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. సమస్యను వెంటనే పరిష్కరించి, మొగులయ్యకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను మాజీ మంత్రి కేటీఆర్ కోరారు.
ఇవి కూడా చదవండి..
కానిస్టేబుల్ హత్యపై డీజీపీ కీలక ఆదేశాలు..
పోక్సో కేసుల పరంపర.. తల్లిదండ్రుల ఆందోళన
Read Latest Telangana News And Telugu News