BJP MP Eatala Rajender on BC Reservations: బీసీ రాజ్యాధికారం కోసం ఉద్యమాలు చేద్దాం: ఈటల
ABN , Publish Date - Oct 18 , 2025 | 02:13 PM
బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో చెప్పారని.. అన్నీ తెలిసినా బీసీలను మోసం చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 18: తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్యమైందో బీసీ రాజ్యాధికారం కూడా అలాగే సాధ్యం అవుతుందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆశయాన్ని ముద్దాడే వరకు ఐక్యంగా ఉద్యమాలు చేద్దామని బీసీ వర్గానికి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్ లో బీసీల బంద్ లో ఈటల పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలిపిందని చెప్పారు. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద 'తెలంగాణ బంద్ (బీసీ బంద్)' లో పాల్గొని మద్దతు తెలిపినట్లు వివరించారు.
బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో చెప్పారని.. అన్నీ తెలిసినా బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని చెప్పారు. పెరియార్ మొదలు అనేక గొప్ప ఉద్యమాలు జరిగాయని అన్నారు. 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో రెండేళ్లపాటు బీసీల ఆర్థిక, సామాజిక, విద్య అన్ని రంగాలపై సమగ్ర సర్వే చేసి.. ఆ రిపోర్ట్ తో రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ లో చేర్చారని గుర్తు చేశారు. తెలంగాణలోనూ కేసీఆర్ ఒకసారి సర్వే చేసి బీసీ కమీషన్ వేశారని.. ఎన్ని వేసిన నిజాయితీ లేదు కాబట్టి అమలు కాలేదని విమర్శించారు.
ఈ ప్రభుత్వం కూడా పేరుకు కమిషన్లు వేశారు తప్ప నిజాయితీ లేదని దుయ్యబట్టారు ఈటల. లెక్కలు తీశారు.. కానీ అవన్నీ తప్పుల తడక అని విమర్శించారు. 52 శాతం ఉంటే 42 శాతం అని కాకి లెక్కలు చెప్తున్నారని మండిపడ్డారు. తాను చెప్పేది అబద్ధమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తాను మాట్లాడిన మాటలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని అన్నారు. తామెంత మంది ఉన్నామో.. తమకు అంత కావాలని అన్నారు. యాచించే స్థాయిలో కాదు శాసించే స్థాయిలో బీసీలు ఉన్నారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినా.. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్క బీసీ, ఒక ట్రైబల్ ముఖ్యమంత్రి కాలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో బీసీలు 8మంది మంత్రులుండాలని కానీ, ముగ్గురే ఉన్నారని ధ్వజమెత్తారు. ఉన్నా వారికి ఇచ్చిన మంత్రి శాఖలు చిన్నవే అని పేర్కొన్నారు. బీసీల పట్ల ముసలికన్నీరు కాకపోతే నామినేటెడ్ పోస్టుల్లో ఎందుకు బీసీలకు స్థానం కల్పించలేదు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తెలంగాణలో బీసీని సీఎం చేస్తానని ప్రకటించిన ప్రధాని మోదీ క్యాబినెట్ లో 27మంది OBC మంత్రులు ఉన్నారని గుర్తు చేశారు. బీజేపీ నిజాయితీని ఎవరు శంకించలేరని అన్నారు. మాదిగ రిజర్వేషన్ చేస్తామని మాట ఇచ్చి ప్రధాని అమలు చేశారని గుర్తు చేశారు. తమిళనాడులో ఏ పద్ధతి ప్రకారం చేశారో అదే పద్ధతిలో ఇక్కడ కూడా చెయ్యాలని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు. ఈ బంద్ కి పిలుపు ఇచ్చింది బీసీ జేఏసీ అని.. అనివార్యంగా అన్ని పార్టీలు పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని చెప్పారు. బీసీ బంద్ విజయవంతం కావడం తొలిసారని చెప్పుకొచ్చారు. 42 శాతం రిజర్వేషన్ల స్థానిక సంస్థలలో మాత్రమే కాదు.. చట్టసభల్లోనూ వచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
Khammam BC Bandh: ఖమ్మంలో బీసీ బంద్.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
BRS On BC Reservations: రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేయడం దారుణం: బీఆర్ఎస్ నేతలు