Share News

BC reservation: జూన్‌లో స్థానికం!

ABN , Publish Date - Feb 13 , 2025 | 03:19 AM

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవు. బీసీ కులగణన సర్వే ప్రక్రియ ఈ నెల 28 వరకు కొనసాగించాలని, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును రూపొందించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించిన

BC reservation: జూన్‌లో స్థానికం!

  • బీసీ కోటా పెంపు యత్నాలతో జాప్యం.. ఏప్రిల్‌ 4 దాకా టెన్త్‌ పరీక్షలు

  • మే నెలలో తీవ్రం కానున్న ఎండలు.. ఆ తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవు. బీసీ కులగణన సర్వే ప్రక్రియ ఈ నెల 28 వరకు కొనసాగించాలని, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును రూపొందించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో స్థానిక ఎన్నికలు జూన్‌, జూలై నెలల్లోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి మొదటి వారంలో ప్రత్యేక అసెంబ్లీ మార్చి, ఏప్రిల్‌ నెలల్లో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు, మేలో ఎండలు మండనున్న నేపథ్యంలో జూన్‌ వరకూ ఎన్నికలు జరిగే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కులగణనలో పాల్గొనని బీసీ కుటుంబాల సర్వే పూర్తయిన తర్వాత.. తాజా గణాంకాల ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపైన డెడికేటెడ్‌ కమిషన్‌.. ప్రభుత్వానికి మళ్లీ నివేదిక ఇవ్వనుంది. ప్రభుత్వం వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని స్థానిక సంస్థల్లో బీసీలకు 42ు రిజర్వేషన్‌ను కల్పిస్తూ బిల్లుకు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేయనుంది.


మార్చి మొదటి వారంలో ప్రత్యేకంగా అసెంబ్లీ నిర్వహించి ఈ బిల్లును ఆమోదించనుంది. అలాగే తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42ు రిజర్వేషన్‌ అమలు చేసేందుకు వీలుగా పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లోనే సవరణలు తీసుకువచ్చి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్నీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఆమోదించనుంది. అనంతరం బిల్లును, అసెంబ్లీ తీర్మానాన్ని ప్రభుత్వం.. కేంద్రానికి పంపనుంది. అంతే కాకుండా అఖిలపక్ష పార్టీలు, సంఘాలను ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలనూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ 4 వరకూ జరగనున్నాయి. అప్పటి దాకా కేంద్రంపై వివిధ రూపాల్లో ఒత్తిడి కార్యక్రమాలు చేపట్టనుంది. కేంద్రం నుంచి స్పందన రాని పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీ పరంగా 42ు రిజర్వేషన్‌ను అమలు చేస్తామని ప్రకటించి.. పాత రిజర్వేషన్‌ ప్రకారమే స్థానిక ఎన్నికలకు వెళ్లనున్నట్లు చెబుతున్నారు.


జూన్‌లో స్థానికం!

అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపి.. బడ్జెట్‌ సమావేశాలకు ముందే స్థానిక ఎన్నికలు నిర్వహించాలనుకున్నా ప్రభుత్వానికి కుదరని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్‌, మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులు మొత్తం ఈ పరీక్షల నిర్వహణ, ఆ తర్వాత పేపర్‌ మూల్యాంకనం ప్రక్రియలోనే ఉంటారు. ఈ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో స్థానిక ఎన్నికల నిర్వహణ సాఽధ్యం కాదంటున్నారు. నడి వేసవి కాలం కావడంతో ఏప్రిల్‌, మే నెలల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవచ్చునని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే జూన్‌, జూలై నెలల వరకూ స్థానిక ఎన్నికలు వాయిదా పడేందుకు ఆస్కారం ఉందంటున్నారు. ఈ లోపున స్థానికంగా ఎంతో కొంత ఉన్న వ్యతిరేకతనూ సర్దుబాటు చేసుకునేందుకు అధికార పార్టీకి అవకాశం చిక్కుతుందనీ రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ములుగు మన్నెంలో జాతరల సందడి

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు రద్దు

మేడారం మినీజాతర.. మొక్కులు చెల్లించకోనున్న భక్తులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 13 , 2025 | 03:19 AM