Election Manifesto: ఆడపిల్ల పుడితే రూ.2.500.. బాండ్ పేపర్ రాసిన సర్పంచ్ అభ్యర్థి!
ABN , Publish Date - Dec 06 , 2025 | 07:39 AM
కొడంగల్ మండలంలోని ఉడిమేశ్వరం గ్రామంలో సర్పంచ్ అభ్యర్ధిగా మున్నూర్ శివకుమార్ పోటీ చేస్తున్నారు. రూ.100 బాండ్ పేపర్ పై 12 హామీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. తనను గెలిపిస్తే గ్రామంలో వాటర్ ప్లాంట్ అభివృద్ధి పనులు, ఆడ పిల్ల పుడితే రూ.2,500, పెళ్లి కానుకగా రూ.5,501 ఇస్తానని హామీ ఇచ్చారు.
కొడంగల్, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అభ్యర్ధులు వినూత్నంగా హామీలు ఇస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. కొడంగల్ మండలంలోని ఉడిమేశ్వరం గ్రామంలో సర్పంచ్ అభ్యర్ధిగా మున్నూర్ శివకుమార్ పోటీ చేస్తున్నారు. రూ.100 బాండ్ పేపర్ పై 12 హామీలతో కూడిన మేనిఫెస్టో(Election Manifesto)ను విడుదల చేశారు. తనను గెలిపిస్తే గ్రామంలో వాటర్ ప్లాంట్ అభివృద్ధి పనులు, ఆడ పిల్ల పుడితే రూ.2,500, పెళ్లి కానుకగా రూ.5,501, అకారణంగా మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు పంచాయతీ నిధుల ద్వారా రూ.6 వేలు, గ్రామంలో ఆరు నెలలకూ సారి ఉచిత వైద్య శిబిరం ఇలా 12 హామీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. సర్పంచ్ గెలిచిన తర్వాత హామీలు అమలు చేయని పక్షంలో గ్రామస్తులు తనను నిలదీయాలని బాండ్ పేపర్ ద్వారా హామీ ఇచ్చారు.
అభ్యర్థులు నచ్చకపోతే నోటా
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడు విడతల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. గ్రామాల్లో ఎన్నికల హడావుడి కని పిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ నోటాకు అవకాశం కల్పించడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. బ్యాలెట్ పేపర్లో చివరి గుర్తు వచ్చిన వారికి నోటా ఇబ్బందిగా మారింది. చివరి గుర్తు తనదేనని, ఓటు వేసి గెలిపించాలని గతంలో ప్రచారం నిర్వహించేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. అందుకే అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు తన గుర్తు నంబర్ ఉన్న చోటును చూపిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు నచ్చకపోతే ఓటర్లు నోటాకు ఓటు వేసే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. వెండి ధరలో భారీ కోత
రూ.100తో వారసత్వ భూముల రిజిస్ర్టేషన్