Crop Damage: నెల్లూరును ముంచిన దిత్వా
ABN , Publish Date - Dec 06 , 2025 | 06:49 AM
దిత్వా తుఫాన్ ప్రభావంతో మూడు రోజులు కురిసిన అతి భారీ వర్షాలు నెల్లూరు జిల్లా రైతులను నిండా ముంచాయి.
6439 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు..19 మండలాలపై తీవ్ర ప్రభావం
నెల్లూరు, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): దిత్వా తుఫాన్ ప్రభావంతో మూడు రోజులు కురిసిన అతి భారీ వర్షాలు నెల్లూరు జిల్లా రైతులను నిండా ముంచాయి. మొత్తం 19 మండలాలపై తీవ్ర ప్రభావం చూపింది. నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు 188 గ్రామాల్లో 12,315 మంది తుఫాన్ బాధితులుగా మిగిలారు. వ్యవసాయ సీజన్ ప్రారంభ దశ కావడంతో రైతులకు నష్టంతోపాటు శ్రమ వృథా అయ్యింది. 6439 హెక్టార్లలో (16,097 ఎకరాలు) పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. 85 చోట్ల చెరువులు, కాలువలకు డ్యామేజీ కాగా, తాత్కాలిక మరమ్మతులకు రూ.4.5 కోట్లు అవసరమవుతాయని ఇరిగేషన్ అధికారులు అంచనా వేశారు. 14 చోట్ల 33 కేవీ ఫీడర్స్, 45 చోట్ల 11 కేవీ ఫీడర్స్, 8 సబ్‌స్టేషన్లు, దెబ్బతిన్నాయి. 30 ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురికాగా, 33 కేవీ పోల్స్ రెండు, 11 కేవీ పోల్స్ 13, ఎల్‌టీ పోల్స్ 7 దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక చాలా చోట్ల రోడ్లు దెబ్బతినడంతో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖలకు భారీగానే నష్టం వాటిల్లింది. అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో తుఫాన్ నష్టాలను అంచనా వేస్తోంది. ఇందుకు ఆయా శాఖలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నాయి. ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు.