Share News

Registration Fee: రూ.100తో వారసత్వ భూముల రిజిస్ర్టేషన్‌

ABN , Publish Date - Dec 06 , 2025 | 06:35 AM

వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్‌ను ప్రభుత్వం సులభతరం చేసింది. నామమాత్రపు స్టాంపు డ్యూటీ వసూలు చేసి, రిజిస్ర్టేషన్లను ప్రోత్సహించాలని నిర్ణయించింది.

Registration Fee: రూ.100తో వారసత్వ భూముల రిజిస్ర్టేషన్‌

  • మార్కెట్‌ విలువ 10 లక్షలు దాటితే ఫీజు రూ.1,000

  • నామమాత్రంగా స్టాంప్‌ డ్యూటీ.. జీవో విడుదల

అమరావతి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్‌ను ప్రభుత్వం సులభతరం చేసింది. నామమాత్రపు స్టాంపు డ్యూటీ వసూలు చేసి, రిజిస్ర్టేషన్లను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం జీవో జారీచేసింది. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్‌ విలువ ప్రకారం సదరు ఆస్తి విలువ రూ.10 లక్షల లోపు ఉంటే రూ.100, ఆ పైన ఉంటే రూ.1,000 ఫీజును స్టాంపు డ్యూటీ కింద తీసుకుంటారు. భూయజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే వాటికి మాత్రమే ఈ ఫీజులు వర్తిస్తాయని జీవోలో పేర్కొంది. ఇప్పటి వరకు వారసత్వ భూముల రిజిస్ర్టేషన్లపై ఆ ఆస్తి మార్కెట్‌ విలువలో 1 శాతాన్ని స్టాంపు డ్యూటీగా వసూలు చేశారు. తల్లిదండ్రుల మరణాంతరం వారసత్వంగా వచ్చే ఆస్తులను వారసులు.. తహసీల్దారుకు దరఖాస్తు చేసి, కాగితాలపై రాసుకుంటున్నారు. వీటికి మ్యుటేషన్లు సకాలంలో జరగడం లేదని, తహసీల్దారు కార్యాలయాల సిబ్బంది పదేపదే తిప్పుతున్నారని గతేడాదిలో 55 వేల ఫిర్యాదులు ప్రభుత్వానికి వచ్చాయి. వీలునామా రాయకుండా యజమాని మరణిస్తే.. వారసులు ఆ ఆస్తులను భాగాలు చేసుకొని, లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయంతో వస్తే.. సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో రూ.100, రూ.1000కే రిజిస్ర్టేషన్‌ చేయనున్నారు.

Updated Date - Dec 06 , 2025 | 06:36 AM