Sonia Gandhi: గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలి
ABN , Publish Date - Dec 06 , 2025 | 05:44 AM
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ ఆకాంక్షించారు. 2034 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక....
రాష్ట్రాభివృద్ధికి రేవంత్ ప్రయత్నాలు అభినందనీయం
సీఎం రేవంత్‌రెడ్డికి సోనియాగాంధీ అభినందన సందేశం
న్యూఢిల్లీ/హైదరాబాద్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ ఆకాంక్షించారు. 2034 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఈ సమ్మిట్ కీలక భూమిక పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డిని అభినందిస్తూ శుక్రవారం సందేశం పంపారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టేందుకు రేవంత్ చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా సోనియా అభినందించారు. రాష్ట్రాభివృద్థికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగస్వాములు కావాలనుకునే అంతర్జాతీయ సమాజానికి ఈ సమ్మిట్ ఒక వేదికగా నిలుస్తుందన్నారు. అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రాజెక్టులకు సమ ప్రాధాన్యమిస్తూ మూడంచెల వ్యూహంతో రాష్ట్రం ముందు కు సాగడం అభినందనీయమన్నారు. తెలంగాణలోని మానవ, సహజ వనరులు, ప్రజల వ్యాపార, సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధికి సమ్మిట్ మరింత తోడ్పడుతుందని సోనియా విశ్వాసం వ్యక్తం చేశారు.