Komatireddy Venkat Reddy: హైదరాబాద్- అమరావతి రోడ్డును విస్తరించండి
ABN , Publish Date - Aug 06 , 2025 | 03:39 AM
హైదరాబాద్- విజయవాడ రహదారిని మల్కాపూర్ నుంచి అమరావతి వరకు నాలుగు లేన్ల నుంచి ఆరు వరుసలకు విస్తరించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వినతి
న్యూఢిల్లీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్- విజయవాడ రహదారిని మల్కాపూర్ నుంచి అమరావతి వరకు నాలుగు లేన్ల నుంచి ఆరు వరుసలకు విస్తరించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. సర్వీస్ రోడ్లు నిర్మించాలన్నారు. ఢిల్లీలో ఎంపీలు రఘురామిరెడ్డి, సురేష్ షెట్కార్, చామల కిరణ్‌కుమార్, వంశీకృష్ణ, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డితో కలిసి కేంద్ర మంత్రికి కోమటిరెడ్డి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎన్‌హెచ్-65ను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు పంపితే.. 15న ఆర్థిక సంఘం సమావేశంలో ఆమోదం తెలిపి, టెండర్లు ఆహ్వానిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. సంగారెడ్డి-చౌటుప్పల్ మధ్య రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులతోపాటు దక్షిణ భాగం కూడా యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని కోరినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో చింతలకుంట చెక్ పోస్ట్ నుంచి హయత్‌నగర్ ఆలిండియా రేడియో స్టేషన్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని కోరామన్నారు.
జోడువాగు రోడ్డు సమస్యను పరిష్కరించాలి
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని జోడువాగు రోడ్లు, నేషనల్ హైవే 63 ఏళ్లుగా డీపీఆర్ దశలోనే ఆగిందని, సమస్యను పరిష్కరించాలని నితిన్ గడ్కరీని మంత్రి వివేక్ కోరారు. తెలంగాణలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, ఐటీఐ హబ్‌లు ఏర్పాటు చేయాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరికి వివేక్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పనిదినాలు పెంచాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క కోరారు. తెలంగాణకు ఖరీఫ్ సీజన్ కోసం 6.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాలో 2.24 లక్షల మెట్రిక్ టన్నులు కొరత ఏర్పడిందని, దీనిని వెంటనే సరఫరా చేయాలని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను ఎంపీ చామల కిరణ్‌కుమార్ లేఖలో కోరారు.
మా తమ్ముడికి మంత్రి పదవి హామీపై నాకు తెలియదు: మంత్రి కోమటిరెడ్డి
తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిపై కాంగ్రెస్ అధిష్ఠానం హామీకి సంబంధించి తనకు సమాచారం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సోదరుడికి మంత్రి పదవి ఇచ్చే స్థాయిలో తాను లేనని, అది తన చేతుల్లో పని కాదని అన్నారు. ‘‘మాది జాతీయ పార్టీ. అగ్రనాయకత్వం సీఎం అభిప్రాయాలు తీసుకుని.. ఆయన అనుమతితో మంత్రి పదవులపై నిర్ణయం తీసుకుంటుంది. అందులో ఎవరి ప్రమేయమూ ఉండదు. పార్టీలోకి తీసుకునేముందు మాట ఇచ్చారనే విషయం నాకు తెలియదు. వారు ఇస్తే సంతోషమే. హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తా. నేను సీఎం రేసులో లేను.. మంత్రి రేసులోనూ లేను. మంత్రి పదవి ఇచ్చారు తీసుకున్నాను’’ అని మంత్రి వెంకట్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎ్‌సపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోందన్న ఆరోపణలపై స్పందిస్తూ కక్ష సాధించేందుకు రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఉంటే కదా? అని ఎద్దేవా చేశారు. ఇక సినిమా టికెట్ ధరలు పెంచినట్లే సినీ కార్మికుల వేతనాలు కూడా పెంచాల్సిన అవసరం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్
Read latest Telangana News And Telugu News