Share News

Minister Ponguleti: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం

ABN , Publish Date - Jun 15 , 2025 | 12:35 PM

స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ రాబోతుందని అన్నారు. త్వరలో ఎన్నికల తేదీలు ప్రకటిస్తారని చెప్పారు.

Minister Ponguleti: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం
Minister Ponguleti Srinivas Reddy

ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికలకు (Local Body Elections) రంగం సిద్ధమైందని తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ రాబోతుందని అన్నారు. త్వరలో ఎన్నికల తేదీలు ప్రకటిస్తారని చెప్పారు. ఇవాళ(ఆదివారం) మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో పర్యటించారు.


పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. అనంతరం కూసుమంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్య నాయకులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రేపటి (జూన్16) కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. అనంతరం సర్పంచ్‌, మున్సిపల్‌ ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.


గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. నాయకులు నేతలు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఎన్నికలు రావడానికి మరో 15రోజుల గడువు మాత్రమే ఉందని అన్నారు. కాబట్టి ఆయా గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం అవ్వాలని సూచించారు. రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.


రాబోయే వారం రోజుల్లోనే అర్హులైన రైతు సోదరులందరికీ కుంట నుంచి ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. సన్నాలకు రైతు బోనస్ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. సంక్షేమ పథకాల ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదేనని చెప్పారు. మీ గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాదని.. వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా నాయకులే తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కోరారు.


రైతులకు ఏరువాక శుభాకాంక్షలు..

‘అమితంగా ప్రేమించే పాలేరు నియోజకవర్గ రైతన్నలు ఏర్పాటు చేసుకున్న ఏరువాక కార్యక్రమంలో పాలుపంచుకున్నాను. ఆరుగాలం కష్టపడి దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించే రైతులకు ఏరువాక శుభాకాంక్షలు. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్న తర్వాత రాష్ట్రంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. రైతును రాజు చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయిన ఈనాడు మా ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహం ఇస్తోంది. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తోంది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఇబ్బంది లేకుండా అందిస్తున్నాం. గత కేసీఆర్ ప్రభుత్వం వారి స్వార్థం కోసం మొదలుపెట్టిన సీతారామ ప్రాజెక్ట్‌ను వదిలేస్తే, వాటిని పూర్తి చేస్తూ సాగునీరు ఇబ్బందులు లేకుండా ఒక్క ఎకరానికి ఇబ్బంది లేకుండా నీటిని అందిస్తున్నాం. ఆ భగవంతుడి దయతో ఈ సంవత్సరం పదిహేను రోజుల ముందే నైరుతి రుతుపవనాలు పలకరించాయి. వ్యవసాయ సీజన్ కూడా మొదలైంది’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.


రేపటి నుంచి రైతు భరోసా..

‘ఆనాటి ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలు రైతు బంధు ఇస్తే జూన్ 16 నుంచి వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరానికి పెట్టుబడి కోసం రూ. 12 వేలు మా ప్రభుత్వంలో ఇస్తాం. రాష్ట్ర ప్రజల తరపున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు. ఆనాటి ప్రభుత్వం రూ.17 వేల కోట్లు రుణమాఫీ చేస్తే, ఇందిరమ్మ ప్రభుత్వం రూ. 21 వేల కోట్లు రుణమాఫీ చేసింది. రైతు భరోసా ఇప్పటికే రెండు సార్లు ఇచ్చాం. రేపటి నుంచి మూడోసారి ఇస్తాం. వరి వేస్తే ఉరే అని గత కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టింది. పేదల, రైతు పక్షపాత ప్రభుత్వంగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. అయినా దేశంలో ధాన్యం పండించిన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఉచిత కరెంట్, రైతు భరోసా ,నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నాం. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తోంది. రాష్ట్రంలో రైతులు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడు ఆశీర్వదించాలి’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కోరుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్

ముగిసిన నిషేధ కాలం.. అర్ధరాత్రి నుంచి చేపల వేటకు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jun 15 , 2025 | 01:30 PM