Share News

KCR: అసెంబ్లీకి వస్తా.. కాంగ్రెస్‌ను ఎండగడతా

ABN , Publish Date - Mar 08 , 2025 | 04:25 AM

‘కాంగ్రెస్‌ పార్టీకి చాలా సమయం ఇచ్చాం. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ఓపికగా ఎదురుచూశాం. కానీ, కాంగ్రెస్‌ సర్కారు ఏమీ చేయకపోగా.. రైతులు, ప్రజలకు ఇబ్బంది కలిగించే అసత్య ప్రచారాలతో కాలం వెళ్లదీస్తోంది’ అని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆరోపించారు.

KCR: అసెంబ్లీకి వస్తా.. కాంగ్రెస్‌ను ఎండగడతా

  • వారికి చాలా సమయం ఇచ్చాం

  • హామీలు నెరవేరుస్తారని చూశాం.. ఏమీ చేయకపోగా అసత్య ప్రచారం చేస్తున్నారు

  • రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు.. ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీఆర్‌ఎ్‌సకు బ్రహ్మరథం పడతారు

  • ఏప్రిల్‌ 27న వరంగల్‌లో బహిరంగ సభ.. 10 లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు

  • పార్టీ నేతలతో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సమాలోచన

మర్కుక్‌/హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ‘కాంగ్రెస్‌ పార్టీకి చాలా సమయం ఇచ్చాం. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ఓపికగా ఎదురుచూశాం. కానీ, కాంగ్రెస్‌ సర్కారు ఏమీ చేయకపోగా.. రైతులు, ప్రజలకు ఇబ్బంది కలిగించే అసత్య ప్రచారాలతో కాలం వెళ్లదీస్తోంది’ అని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తానే స్వయంగా పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగడతానని వెల్లడించారు. కాంగ్రెస్‌ అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీయే తెలంగాణ సమాజానికి రక్షణ కవచమని 15 నెలల కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి రుజువైందని చెప్పారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ నేతలతో కేసీఆర్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో కేటీఆర్‌, హరీశ్‌ సహా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ పలు అంశాలపై మాట్లాడారు. వచ్చే నెలలో జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవం, 25 ఏళ్ల వేడుకలు, వరంగల్‌లో భారీ బహిరంగ సభ, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంతో పాటు దేశంలో వర్తమాన రాజకీయ పరిస్థితులపై నాయకులతో చర్చించారు. కాంగ్రెస్‌ ఆశ పెట్టిన గ్యారెంటీలను నమ్మి గెలిపించిన ప్రజలు.. ఇప్పుడు ఆ పార్టీ నిజస్వరూపం తెలుసుకున్నారని కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎ్‌సకు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దామని, ఆ తర్వాత బీసీల పక్షాన పోరాడదామని పార్టీ నేతలతో అన్నారు. బీఆర్‌ఎ్‌సపార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో తెలంగాణ సమాజం గర్వపడేలా రజతోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. వరంగల్‌లో ఏప్రిల్‌ 27న 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని, అందుకు అనువైన స్థలాన్ని గుర్తించాలని సూచించారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారీ బహిరంగ సభను నిర్వహించాలని పేర్కొన్నారు. బహిరంగ సభ సన్నాహక సమావేశాలను నియోజకవర్గాల వారీగా నిర్వహించాలని చెప్పారు. అందుకోసం త్వరలో కమిటీలను వేయనున్నట్లు తెలిపారు.


పార్టీ బలోపేతానికి కమిటీలు..

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని కేసీఆర్‌ పేర్కొన్నారు. వరంగల్‌ బహిరంగ సభ అనంతరం ఆ దిశగా కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆ కమిటీల బాధ్యులతో ప్రతినిధుల సభను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పార్టీలో యువత, మహిళల భాగస్వామ్యం పెంచాలని సూచించారు. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వమున్నా తెలంగాణకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నాయని, ఈ నేపథ్యంలో దేశ రాజకీయ పరిణామాల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్లమెంటులో బీఆర్‌ఎస్‌ ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతోందని, ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని కేసీఆర్‌ పేర్కొన్నారు.

రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ..!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ రెండు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్‌ చర్చించినట్లు సమాచారం. ఎవరిని బరిలో దించాలన్న దానిపై జరిగిన చర్చలో ప్రధానంగా సత్యవతి రాథోడ్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, దాసోజు శ్రవణ్‌ పేర్లు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. అయితే ఇందులో ఇద్దరిని పోటీలో నిలబెట్టే అవకాశం ఉంది. ఆ ఇద్దరు ఎవరనేది కేసీఆర్‌ త్వరలో ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.


కేంద్ర కొత్త ఐటీ బిల్లుతో పౌరుల డిజిటల్‌ గోప్యతకు ముప్పు: కేటీఆర్‌

హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త ఆదాయపు పన్ను (ఐటీ) బిల్లుతో పౌరుల డిజిటల్‌ గోప్యతకు ముప్పు కలగనుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఇందులో ప్రస్తావించిన ‘వర్చువల్‌ డిజిటల్‌ స్పైసెస్‌’.. వేధింపులకు, దుర్వినియోగానికి, విస్తృత నిఘాకు దారితీయొచ్చని అభిప్రాయపడ్డారు. సోషల్‌ మీడియా, ఈమెయిల్స్‌, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ఖాతాలపై పన్ను తనిఖీ పేరుతో కొత్త ఆదాయపు పన్ను బిల్లు ఐటీ అధికారులకు అపరిమిత అధికారాలను ఇచ్చేలా ఉందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రం ప్రతిపాదించిన ఈ బిల్లును దేశపౌరులు, విపక్షాలు వ్యతిరేకించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

శ్రీవిద్యకు కేటీఆర్‌ అండ

హైదరాబాద్‌ సిటీ: సనత్‌నగర్‌లోని దాసారం బస్తీకి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి మల్లెల శ్రీవిద్యకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అండగా నిలిచారు. ఆంధ్రజ్యోతిలో గురువారం ప్రచురితమైన ‘‘ఆధార్‌ ఇప్పిస్తే.. ఈ చిన్నారి చదువుకుంటుంది..’’ అనే వార్తా కథనానికి స్పందించిన ఆయన శుక్రవారం తన కార్యాలయ సిబ్బందిని శ్రీవిద్య ఇంటికి పంపించి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆమె రెండేళ్ల స్కూల్‌ ఫీజును చెల్లించారు. భవిష్యత్తులో శ్రీవిద్య చదువుకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి...

CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి

Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..

TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 08 , 2025 | 08:25 AM