Munugodu By election: ఆగిన చోటు నుంచే!?
ABN , Publish Date - Aug 06 , 2025 | 04:01 AM
మూడేళ్ల కిందట జరిగిన మునుగోడు ఉప ఎన్నిక ముందు.. తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు బీజేపీ ఎర వేసిందంటూ నాటి సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.
‘ఫాంహౌస్’ కేసులోని కీలక వ్యక్తులతోనే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ ఆరంభం?
నాడు బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ పేరు కేసులోకి.. నేడు ఆయన్నే కలిసిన గువ్వల
బీజేపీలో చేరనున్నట్లు ప్రకటన సంతోష్‌ని కలిసిన మరో ‘ఫాంహౌస్’ నేత
హైదరాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): మూడేళ్ల కిందట జరిగిన మునుగోడు ఉప ఎన్నిక ముందు.. తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు బీజేపీ ఎర వేసిందంటూ నాటి సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఆ నలుగురు ఎమ్మెల్యేలను(గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి, రేగా కాంతారావు) తనతో పాటు ప్రచారానికి తీసుకువెళ్లి.. బీజేపీ రూ.వంద కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడినా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడారంటూ వారిని ఆకాశానికి ఎత్తేశారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారంటూ బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్ పేరును కేసులోకి తెచ్చారు. ఈ క్రమంలో మూడేళ్ల తర్వాత బీజేపీ తన ఆపరేషన్ ఆకర్ష్‌ను మళ్లీ ప్రారంభించిందా? ఏ ఫాంహౌస్ నుంచైతే తమను లక్ష్యంగా చేసుకొని బీఆర్‌ఎస్ రాజకీయ రచ్చ చేసిందో.. అదే ఫాంహౌస్ కేసులోని కీలక వ్యక్తులతోనే రివర్స్‌గేమ్‌ను మొదలుపెట్టిందా? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. నాడు ఫాంహౌ్‌సలో సమావేశమైన నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు (ప్రస్తుతం మాజీ) ఇటీవల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్‌ని కలుసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాను ఈ నెల 9న బీజేపీలో చేరుతున్నట్లు గువ్వల ప్రకటించగా, మరో మాజీ ఎమ్మెల్యే కూడా త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. ఆయనతో పాటు బీఆర్‌ఎస్ మరో మాజీ ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికలో తాము గెలిచి ఉంటే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారిపోయేదని కమలనాథులు అభిప్రాయపడుతున్నారు. ఉప ఎన్నిక ముందు ఆ ఘటన జరిగి ఉండకపోతే తప్పకుండా తామే గెలిచేవాళ్లమని, అప్పుడు రాజకీయ చిత్రమే మారిపోయేదని పేర్కొంటున్నారు. అందుకే ఎక్కడైతే తమ ప్రణాళిక ఆగిపోయిందో అక్కడి నుంచే బీఆర్‌ఎస్ లక్ష్యంగా రివర్స్‌ప్లాన్ మొదలు పెట్టిందని అంటున్నారు. ఈ వ్యవహారమంతటికీ ఫోన్ ట్యాపింగే కారణమని పార్టీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెప్పుకొంటున్నారు.
బీఆర్‌ఎస్ లక్ష్యంగా పావులు..
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం, అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న బీఆర్‌ఎ్‌సను మరింత దెబ్బతీయడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం పావులు కదుపుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రె్‌సకు ప్రత్యామ్నాయశక్తిగా ఎదిగే క్రమంలో బీఆర్‌ఎ్‌సలో జరుగుతున్న పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో బీజేపీని లక్ష్యంగా చేసుకొని, పనిచేసిన బీఆర్‌ఎస్ నేతలనూ ఆకర్షించేందుకు పార్టీ అగ్రనాయకత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందా? సొంత పార్టీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కొందరు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బీజేపీవైపు దృష్టి సారించారా? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గణనీయంగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ నాయకత్వం అందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ క్రమంలో బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసేందుకే ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీసిందన్న ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ విలీనమైనా కేటీఆర్‌తోనే ఉంటాం
మర్రి జనార్దన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్ స్పష్టీకరణ
నాగర్‌కర్నూల్/కందనూలు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎ్‌సను తాము ఎట్టిపరిస్థితుల్లోనూ వీడబోమని నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్ మరోసారి స్పష్టం చేశారు. తమ పార్టీ మరో పార్టీలో విలీనమైనా తాము మాత్రం కేటీఆర్‌తోనే ఉంటామని, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని కుండబద్దలు కొట్టారు. మంగళవారం మాజీ మంత్రి హరీశ్‌రావు నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని నాగర్‌కర్నూలులోని బీఆర్‌ఎస్ భవన్‌లో ఆ పార్టీ కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి మర్రి జనార్దన్‌రెడ్డి వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను పార్టీ వీడనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలపడంలో తాము పూర్తిగా విఫలమయ్యామని చెప్పారు. కాగా, చావైనా రేవైనా తాము బీఆర్‌ఎ్‌సతోనే ఉంటామని బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్ అన్నారు. గువ్వల బాలరాజు బీఆర్‌ఎ్‌సను వీడటం బాధాకరమన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్
Read latest Telangana News And Telugu News