Share News

Kavitha: బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలిపే ప్లాన్‌

ABN , Publish Date - May 30 , 2025 | 05:04 AM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎ్‌సను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరుగుతోందని, తాను పార్టీలో ఉన్నంతకాలం అది కుదరదన్న ఉద్దేశంతో తనను కేసీఆర్‌కు దూరం చేసే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Kavitha: బీఆర్‌ఎస్‌ను  బీజేపీలో కలిపే ప్లాన్‌

నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన.. అడ్డుకుంటాననే కేసీఆర్‌కు దూరం చేసే కుట్ర

  • ఇంటి ఆడబిడ్డపై సోషల్‌ మీడియాలో విషప్రచారాలు

  • బీజేపీ నేతల ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వెళ్లిందెవరు?

  • కేసీఆర్‌లాగే నాక్కొంచెం తిక్క.. నోరు తెరిస్తే తట్టుకోలేరు

  • పార్టీ ఫోరంలో ఏముంది? ప్రజల మధ్యే మాట్లాడతా

  • కేసీఆర్‌కు నోటీసులిచ్చినా స్పందించకపోవడమేంటి?

  • ఇతరులకు నోటీసులిస్తే మాత్రం హంగామా ఎందుకు?

  • ముఖ్య నాయకులు ట్వీట్లకే పరిమితమైతే ఎలా?

  • వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా చేయాల్సిన పనులు చేయాలిగా?

  • విదేశాల్లో రజతోత్సవ వేడుకలతో లాభమేంటి?

  • కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తగిన విధంగా స్పందించడంలేదు

  • పార్టీ పోరాటాలు జాగృతి చేయాల్సి వస్తోంది

  • పార్టీ ఎమ్మెల్యేలు, వెంట ఉన్నవారే ఎంపీగా ఓడించారు

  • కేసీఆరే నా నాయకుడు.. ఇతరుల కింద పనిచేయను

  • కాంగ్రెస్‌ మునిగిపోయే పడవ.. అందులో చేరతానా?

  • మీడియాతో చిట్‌చాట్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎ్‌సను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరుగుతోందని, తాను పార్టీలో ఉన్నంతకాలం అది కుదరదన్న ఉద్దేశంతో తనను కేసీఆర్‌కు దూరం చేసే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ఇంటి ఆడబిడ్డనైన తనపై పెయిడ్‌ సోషల్‌ మీడియాలో విషప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఇబ్బంది పెడితే ఊరుకోబోనని, తాను నోరు విప్పితే తట్టుకోలేరని హెచ్చరించారు. కేసీఆర్‌కు నోటీసులిస్తే పార్టీ స్పందించలేదని, కానీ.. ఇతరులకు నోటీసులొస్తే మాత్రం హంగామా చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను కాంగ్రె్‌సలో చేరతానన్నది అబద్ధమని చెప్పారు. కొత్త పార్టీ అవసరం తనకు లేదని, ఉన్న పార్టీని కాపాడుకుంటే చాలునని వ్యాఖ్యానించారు. కేసీఆరే తన నాయకుడని, ఇతరుల నాయకత్వంలో తాను పనిచేయబోనని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కవిత మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ‘‘బీఆర్‌ఎ్‌సను బీజేపీలో కలిపే ప్రయత్నం వందకు 101 శాతం జరుగుతోందన్నారు. తాను జైల్లో ఉన్న సమయంలోనే ఈ ప్రతిపాదన వచ్చిందని తెలిపారు అయితే న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, ఎంతవరకైనా పోరాడదామని, తన కోసం బీజేపీలో కలిపి పార్టీ భవిష్యత్తును పాడు చేయొద్దని కోరానని అన్నారు. కేసీఆర్‌ను, పార్టీని మోస్తున్నామని గొప్పగా భావిస్తున్న వాళ్లు.. ఎలాగైనా పార్టీని గంపగుత్తగా బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ‘‘మా నాన్నకు లేఖ రాస్తే తప్పేంటి? అయినా నీకు నొప్పేందిరా బై? నాకు నీతులు చెబుతున్న పార్టీ నేతలు.. తెలంగాణ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలి. ప్రజా సమస్యలపై పోరాడాలి. కాంగ్రెస్‌, బీజేపీ దుశ్చర్యలను ఎండగట్టాలి. పార్టీ అధినేతకు రహస్యంగా రాసిన లేఖను ఎవరు బయటపెట్టారని నేను ప్రశ్నిస్తే.. నా బృందమే లీక్‌ చేసిందంటూ కేసీఆర్‌ ఇంటి ఆడబిడ్డపైనే తమ పెయడ్‌ సోషల్‌ మీడియా, పెయిడ్‌ పత్రికలు, యూట్యూబ్‌ చానళ్ల ద్వారా విషప్రచారం చేస్తున్నారు. పార్టీలో కోవర్టులున్నారంటూ నా మీద పడి ఏడుస్తున్నారు. ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే.. అది మర్యాదేనా? లీకు వీరులను బయట పెట్టమంటే.. గ్రీకువీరులు నాపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ఇక్కడ చాలదన్నట్లు విదేశాల్లో కూడా సోషల్‌ మీడియా వర్కర్లను పెట్టుకొని దుష్ప్రచారం చేయిస్తున్నారు’’ అని కవిత ధ్వజమెత్తారు.


కేసీఆర్‌లాగే నాక్కొంచెం తిక్క..

తనపై కాంగ్రెస్‌, బీజేపీ వారు సైతం ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తుంటే పార్టీ నేతలు ఏం చేస్తున్నారని కవిత ప్రశ్నించారు.‘‘ కేసీఆర్‌లాగా నొక్కొంచెం తిక్క. పార్టీ భవిష్యత్తు కోసమే మాట్లాడుతున్నా. నన్ను ఇబ్బందిపెడితే ఒప్పుకోను. నేను నోరు విప్పితే తట్టుకోలేరు. నన్ను కాంగ్రెస్‌ కోవర్ట్‌ అన్నారు.. మరి బీఆర్‌ఎ్‌సలో బీజేపీ కోవర్టులు ఉన్నారనుకోవాలా? బీజేపీ నేతలకు చెందిన హాస్పిటళ్ల ప్రారంభోత్సవాలకు వెళ్లిందెవరో అందరికీ తెలుసు’’ అని కవిత వ్యాఖ్యానించారు. పదవులు కోరినట్లు తనపై పత్రికల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, నాకు పదవులమీద ఆశ లేదని, కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ పార్టీని కాపాడుకోవాలన్నదే తన లక్ష్యమని అన్నారు. లిక్కర్‌ కేసు సమయంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటే కేసీఆర్‌ వద్దన్నారని, జైలుకు వెళ్లివచ్చాక కూడా అడిగానని తెలిపారు. పార్టీ అధినేత సూచన మేరకే ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతున్నానని చెప్పారు. కడుపులో బిడ్డను పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో సైనికురాలిగా పనిచేశానని అన్నారు. తనను విమర్శిస్తున్న నేతలు కేసీఆర్‌ నీడన ఉన్నారు తప్ప.. వారు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయని ప్రశ్నించారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు ఇవ్వాల్సిన ప్రొటోకాల్‌, గౌరవం ఉంటుందని, దానిని నేను విస్మరించనని అన్నారు. తనను పార్టీ ఫోరంలో మాట్లాడమంటున్నారని, ఫోరంలో ఏముందని ప్రశ్నించారు. తాను ప్రజల మధ్యే మాట్లాడతానన్నారు.

25.jpg


కేసీఆర్‌కు నోటిసులిస్తే కార్యాచరణేదీ?

కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన కమిషన్‌ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడుతుంటే.. పార్టీ ఎందుకు కార్యాచరణ తీసుకులేదని కవిత ప్రశ్నించారు. తమకు తాము పెద్ద నేతలుగా ఊహించుకునేవారు ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు. కేసీఆర్‌ నీడలో పనిచేస్తున్నవారు.. తనపై ప్రతాపం చూపించడం సరికాదని, దమ్ముంటే పార్టీ అధినేతకు నోటీసులిచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిపై, బీజేపీపై ప్రతాపం చూపించాలని హితవు పలికారు. పార్టీ ముఖ్యనాయకులు ట్వీట్లకే పరిమితమైతే ఎలా? అని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చేయాల్సిన పనులు చేయాలి కదా! అని అన్నారు. ముఖ్యమైన సందర్భాల్లో కూడా పార్టీ కార్యాచరణ అమలు చేయడంలేదన్నారు. ‘‘అధికార కాంగ్రె్‌సపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఏం చేస్తోంది? జనంలోకి వెళ్లి మనమేంటో తెలియపరచాలి కదా! కేసీఆర్‌ రాజనీతిజ్ఞుడు. ఎప్పుడు ఎలా స్పందించాలో.. ఆయనకు తెలిసినంత ఏ నాయకునికీ తెలియదు. ఆయన ప్రజల్లోకి రావాల్సినప్పుడు వస్తారు.. పార్టీని నిలబెట్టుకుంటారు. ఈలోపు పెద్ద నాయకులమని చెప్పుకొనేవారు పార్టీ కోసం పనిచేయాలి కదా!’’ అని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ వేడుకలు అమెరికా, లండన్‌లలో నిర్వహిస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు పెద్దపెద్ద వాళ్లను పెంచి పోషించారని, ఇప్పుడు వాళ్లంతా ఎటువైపు ఉన్నారో ఆలోచించాలని సూచించారు. సామాన్య ప్రజల కోసం పోరాడితేనే.. పార్టీకి పట్టు ఉంటుందని, అందుకే నేను సామాజిక అంశాలపైనే ఉద్యమిస్తున్నానని తెలిపారు. పార్టీలో కొందరికి ఇది మింగుడుపడటం లేదని, అయినా.. ప్రజల మఽధ్యే ఉంటానని, వారి కోసమే పాటుపడతానని స్పష్టం చేశారు.


ఉద్యమ సమయంలోనే జాగృతి ఏర్పడింది..

సామాజిక తెలంగాణ సాధన కోసం తాను పోరాటం చేస్తానని కవిత ప్రకటించారు. ఉద్యమ సమయంలో ఇక్కడి సంస్కృతి, సాహిత్యం, సమాజ చైతన్యం కోసం తెలంగాణ జాగృతి ఏర్పడిందని, అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్‌ సూచన ప్రకారం జాగృతి పలు కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. ఇప్పుడు తెలంగాణ ద్రోహులు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని, ఈ సమయంలో ఏమి అవసరమో వాటిపైనే దృష్టి పెట్టి.. తమ సంస్థ కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. కొన్ని సందర్భాల్లో బీఆర్‌ఎస్‌ తగినవిధంగా స్పందించకపోవడంతో.. పార్టీ చేయాల్సిన పోరాటాలు కూడా జాగృతి చేయాల్సివస్తోందన్నారు. ‘‘కేసీఆర్‌ను మేమే మోస్తున్నామనే భ్రమల్లో ఉన్న మావాళ్లు కొందరు.. సోషల్‌ మీడియాలో మహాభారతం క్యారెక్టర్లు వేస్తున్నారు. వారు స్థాయికి మించి ఊహించుకుంటున్నారు. వరంగల్‌ సభ తమ వల్లనే సక్సెస్‌ అయిందని అనుకుంటున్నారు. కేసీఆర్‌ను మోసేంత పెద్దవాళ్లమా? ఆయనే పార్టీని, మమ్మల్ని అన్నివేళల్లో మోయగలిగిన పోరాటయోధుడు’’ అని కవిత వ్యాఖ్యానించారు. తాను ముక్కుసూటిగా ఉంటానని, వెన్నుపోటు రాజకీయాలు చేయడం తనకు రాదని అన్నారు. కొందరు కడుపులో విషం పెట్టుకొని.. పైకి తియ్యగా మాట్లాడతారని విమర్శించారు. నిజామాబాద్‌లో తాను ఎంపీగా పోటీ చేస్తే పార్టీ ఎమ్మెల్యేలు, వెంట ఉన్న ముఖ్య నాయకులే ఓడించారని ఆరోపించారు. బీఆర్‌ఎ్‌సలో గత కొంతకాలంగా ఈ సంస్కృతి నడుస్తోందని, దీనివల్ల అంతిమంగా ఎవరికి నష్టమో ఆలోచించుకోవాలని హితవు పలికారు.


నా తండ్రిని వదిలి నేనెక్కడికి వెళ్తాను?

‘‘నా తండ్రిని, నా కుటుంబాన్ని వదిలి నేనెందుకు వెళ్తాను? నన్ను, కేసీఆర్‌ను విడదీసే కుట్ర చేస్తున్నారు. నన్ను దూరంచేస్తే ఎవరికి లాభం జరుగుతుందో ఆలోచించుకోవాలి. నాకు కొత్త పార్టీ అవసరం లేదు. ఉన్న పార్టీ బాగా చూసుకుంటే చాలన్నది నా అభిప్రాయం. నేను రాసిన లేఖలోని సూచనల్లో ఒక్కటైనా తప్పుందా? కేసీఆర్‌ను నడిపించేంత పెద్దవాళ్లు అయ్యారా? నా తండ్రికి వందల లేఖలు రాశాను.. తప్పేంటి?’’ అని కవిత ప్రశ్నించారు. సాధారణంగా కేసీఆర్‌ లేఖను చదివాక చించేస్తారని తెలిపారు. ఈసారి అలా చింపలేదని, కుట్ర ఎవరు చేశారో తనకు తెలియదని అన్నారు. ఈ విషయం బయటపెట్టాలని కోరుతున్నానన్నారు. దామోదర్‌రావు, గండ్ర మోహన్‌రావు వచ్చి తనను కలిశారని, వాళ్లిద్దరూ ఎవరికి దగ్గరో తెలుసు కదా! అని వ్యాఖ్యానించారు. ఇతర నేతల అంశంలో స్పందించిన పార్టీ.. తన విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ బలహీనమైతే కాంగ్రెస్‌, బీజేపీలకు లాభం చేకూరుతుందన్నారు. ఇక బనకచర్ల ప్రాజెక్టు పేరిట గోదావరి జలాలను తరలించుకు పోయేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నా కేంద్రం అడ్డుకోవడం లేదని కవిత ఆరోపించారు. ఆ ప్రాజెక్టుతో తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందన్నారు. కనీసం రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా దీనిని అడ్డుకునే ప్రయత్నం చేయాలన్నారు.


కాంగ్రెస్‌ మునిగిపోయే పడవ..

తాను కాంగ్రె్‌సలో చేరడానికి ప్రయత్నించాననడం అబద్ధమని కవిత అన్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ చేతకానితనం, రాహుల్‌గాంధీ అసమర్థత వల్లే కేంద్రంలో బీజేపీ మళ్లీ మళ్లీ గెలుస్తోందన్నారు. కాంగ్రెస్‌ మునిగిపోయే పడవ అని, అందులో చేరాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానంతో తాను 2013లో మాట్లాడానని, ఆ తర్వాత ఎప్పుడూ ఆ పార్టీతో టచ్‌లోకి వెళ్లలేదని చెప్పారు. తన పార్టీ బీఆర్‌ఎస్‌ అని, తన నాయకుడు కేసీఆర్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, అందులో ఎలాంటి అనుమానం లేదని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి తన తండ్రి తనకు హీరో అని, ఇతర నేతల నాయకత్వంలో తాను పని చేయనని కవిత స్పష్టం చేశారు. కేసీఆర్‌ను ఎప్పుడు కలిసేది చెప్పలేనని, దీనికి డెడ్‌లైన్‌ ఏమీ లేదని అన్నారు. ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాలపై ప్రశ్నించగా.. ‘అంకుల్‌ ఏదో రాస్తున్నారు. రాయనివ్వండి’ అని వ్యాఖ్యానించారు.


కవిత వెంట మల్లారెడ్డి!

మేడ్చల్‌: ఎమ్మెల్సీ కవిత వ్యవహారం బీఆర్‌ఎ్‌సలో సంచలనం సృష్టిస్తుండగా.. మేడ్చల్‌ ఎమ్మెలే ్య మల్లారెడ్డి గురువారం కవితతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా తూంకుంట మునిసిపల్‌ పరిధిలోని సేవాలాల్‌ తండాలో సేవాలాల్‌ మహారాజ్‌ ఆలయ 3వ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, ‘‘కేసీఆర్‌ పులి.. కవిత పులిబిడ్డ. పెద్ద మనిషి వచ్చినప్పుడు కార్యక్రమానికి రావాలి కదా!’’ అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ కుటుంబం మరో కొత్త సినిమా.. యెన్నం సెటైరికల్ కామెంట్స్

గద్దర్ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 30 , 2025 | 06:07 AM