Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్
ABN , Publish Date - Dec 24 , 2025 | 01:46 PM
గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేకుంటే మెడలు వంచుతామని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
కరీంనగర్, డిసెంబర్ 24: గ్రామ పంచాయతీలకు నెలరోజుల్లోగా నిధులు విడుదల చేయాలని.. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. రెండేళ్లుగా రాష్ట్రంలోని పంచాయతీలకు నిధులు ఇవ్వలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. బుధవారం కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. పంచాయితీలకు ఇచ్చిన నిధులన్నీ కేంద్రానివే అని స్పష్టం చేశారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ రాకముందే.. నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆయన సూచించారు.
ఇటీవల తెలంగాణలో మూడు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక గ్రామ పంచాయతీలను గెలుచుకుంది. గ్రామ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు.. మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదీకాక.. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది.
వీటిని సంక్రాంతి పండగ వెళ్లిన తర్వాత చేపట్టాలని భావిస్తుంది. ఒకవేళ ఈ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే.. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఇది నిధుల విడుదలకు అడ్డంకిగా మారుతోంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్.. మోదీ రియాక్షన్
అనుకోకుండా తలుపు తట్టిన అదృష్టం..
For More TG News And Telugu News