Year Ender: అనుకోకుండా తలుపు తట్టిన అదృష్టం..
ABN , Publish Date - Dec 24 , 2025 | 10:06 AM
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేయడం వెనుక ఆ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే ఒక చర్చ సైతం సాగింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసిందనే ప్రచారం నడిచింది.
మరికొద్ది రోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. కొత్త సంవత్సరంలోకి ప్రపంచమంతా అడుగు పెట్టబోతోంది. ఈ ఏడాది దేశంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి ఉప రాష్ట్రపతి ఎన్నిక. అంటే 2027లో ఈ పదవికి ఎన్నిక జరగాల్సి ఉంది. కానీ రెండేళ్ల ముందే అంటే.. 2025లోనే ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరిగింది. ఇంకా చెప్పాలంటే.. ఈ ఏడాది సీపీ రాధాకృష్ణన్‌ను అనుకోకుండా అదృష్టం తలుపు తట్టింది. దాంతో మహారాష్ట్ర గవర్నర్‌గా ముంబైలో ఉన్న ఆయనను దేశ రాజధాని న్యూఢిల్లీకి వచ్చేటట్లు చేసింది.
ఏమైందో ఏమో..
2022లో ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో నాటి బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్‌ను తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే కూటమి బరిలో నిలిపింది. ప్రతిపక్షాల అభ్యర్థిగా మార్గరేట్ ఆల్వా రంగంలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ దన్‌ఖడ్ గెలుపొంది ఆ పదవిని చేపట్టారు. ఉప రాష్ట్రపతిగానే కాక.. రాజ్యసభ చైర్మన్‌గా ఆయన తన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారు. 2027, ఆగస్టు వరకు జగదీప్ దన్‌ఖడ్ ఈ పదవిలో కొనసాగాల్సి ఉంది. కానీ ఏమైందో ఏమో కానీ.. 2025 జులైలోనే ఉప రాష్ట్రపదవికి జగదీప్ దన్‌ఖడ్ రాజీనామా చేశారు. ఆ వెంటనే ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఆమోదం తెలిపారు. దీంతో ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది.
ఇండి కూటమి అభ్యర్థిగా..
ఎన్నికల సంఘం నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. ఈ పదవికి అభ్యర్థులుగా పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. చివరకు మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను తమ అభ్యర్థిగా బరిలో నిలుపుతున్నట్లు ఎన్డీయే కూటమి ప్రకటించింది. ఇక ఇండి కూటమి సైతం ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని రంగంలో నిలిపింది. ఈ ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. అనంతరం మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేసి.. ఉప రాష్ట్రపతి పదవిని సీపీ రాధాకృష్ణన్ చేపట్టారు.
ఆచితూచి వ్యవహరించిన కమలదళం..
ఈ ఏడాది ఉప రాష్ట్రపతి ఎన్నికలు వస్తాయని అసలు ఎవరూ ఊహించ లేదు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేయడం వెనుక ఆ పార్టీ అగ్రనాయకత్వం కీలకంగా వ్యవహరించిందనే ఒక చర్చ సైతం సాగింది. సీపీ రాధాకృష్ణన్ స్వస్థలం తమిళనాడు. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఆయన గతంలో పని చేశారు. తమిళనాడులో బీజేపీ బలోపేతానికి ఆయన శాయశక్తుల కృషి చేశారు. అంతేకాదు.. సీపీ రాధాకృష్ణన్ తమిళనాడులోని బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కూడా. ఇక 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేసేందనే ప్రచారం సైతం సాగింది. గతంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్న జగదీప్‌ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిపితే.. ఈ సారి మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్‌ను రంగంలోకి దింపారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో సైతం..
మరోవైపు 2022లో ఉప రాష్ట్రపతి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు భారత రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ జార్ఖండ్ గవర్నర్‌గా ఒడిశాలో షెడ్యూల్ తెగలకు చెందిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే కూటమి బరిలో నిలిపింది. ఈ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. ఆ తర్వాత అంటే.. 2024లో జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఇదే రీతిలో తమిళనాడులో సైతం అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కమలనాధులు ముందస్తు ప్రణాళికలో భాగంగా సీపీ రాధాకృష్ణన్‌ను ఉప రాష్ట్రపతిగా ఎంపిక విధానం నడిచిందని ఒక ప్రచారం సైతం కొనసాగింది. ఏదీ ఏమైనా.. 2027 వరకు తన పదవి కాలం ఉన్నా జగదీప్ దన్‌ఖడ్ తన పదవికి ఆకస్మాత్తుగా రాజీనామా చేయడంతో.. సీపీ రాధాకృష్ణన్‌ను అదృష్టం వరించిందని చెప్పవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
చలితో వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు