Cold Wave In Telugu States: చలితో వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు
ABN , Publish Date - Dec 24 , 2025 | 08:05 AM
డిసెంబర్ తొలి వారం నుంచి చలి ప్రారంభమైంది. దాని తీవ్రత రెండో వారంలోనే అధికమైంది. ఉదయం, రాత్రి సమయాల్లో దట్టమైన పొగ మంచు ఆవారిస్తుంది. వారంలో గరిష్ట ఉష్ణోగ్రతలే కాదు.. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి.
అమరావతి, డిసెంబర్ 24: చలి గుప్పిటిలో తెలుగు రాష్ట్రాలు చిక్కుకున్నాయి. భారత వాతావరణ శాఖ ఇప్పటికే డిసెంబర్ 24వ తేదీ వరకు కోల్డ్ వేవ్ అలర్ట్ జారీ చేసిన విషయం విదితమే. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. తెలంగాణ సంగారెడ్డి జిల్లాలోని కోహిర్‌లో అత్యల్పంగా 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆదిలాబాద్, ఆసీఫాబాద్, వికారాబాద్, మెదక్, కామారెడ్డిలో సైతం ఉష్ణాగ్రతలు భారీగా పడిపోయాయి. ఇక హైదరాబాద్‌లో సాధారణంగా 10 నుంచి 12 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండగా.. నగర శివారు ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి.
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం చలి తీవ్రత మరింతగా పెరిగింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అరకు, పాడేరు, చింతపల్లి తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయాయి. ఉదయం, రాత్రి వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి విపరీతంగా ఉన్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులతోపాటు శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తు్న్నారు. చలి తీవ్రత ఈ డిసెంబర్ నెలాఖరు వరకు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
డిసెంబర్ తొలి వారం నుంచి చలి ప్రారంభమైంది. దాని తీవ్రత రెండో వారంలోనే అధికమైంది. ఉదయం, రాత్రి సమయాల్లో దట్టమైన పొగ మంచు ఆవారిస్తుంది. వారంలో గరిష్ట ఉష్ణోగ్రతలే కాదు.. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ చలి కారణంగా.. పాలు, కూరగాయల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున ప్రయాణం చేసే వారు పొగ మంచు కారణంగా రహదారులు స్పష్టంగా కనబడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు
For More AP News And Telugu News