LVM3 M6 Success: బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్.. మోదీ రియాక్షన్
ABN , Publish Date - Dec 24 , 2025 | 11:45 AM
శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం ప్రయోగించిన బాహుబలి రాకెట్ ఎల్‌వీఎం3- ఎం6 ప్రయోగం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తమదైన శైలిలో స్పందించారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం ప్రయోగించిన బాహుబి రాకెట్ ఎల్‌వీఎం3- ఎం6 ప్రయోగం విజయవంతమైంది. అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్ 2 ను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై దేశంలోని పలువురు ప్రముఖులు స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రాబబు నాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తమ ఎక్స్ ఖాతాల వేదికగా వేర్వేరుగా స్పందించారు.
ప్రధాని మోదీ స్పందిస్తూ.. భారతదేశ యువత శక్తితో.. మన అంతరిక్ష రంగం మరింత అభివృద్ధి చెందుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది ప్రభావవంతంగా మారుతోందని ఆయన ఆకాంక్షించారు. ఎల్‌వీఎమ్ 3 నమ్మకమైన హెవీ లిఫ్ట్ పనితీరును కనబరుస్తుందన్నారు. గగన్‌యాన్ వంటి భవిష్యత్ మిషన్ల కోసం బలమైన పునాదులు వేస్తున్నామని తెలిపారు. అలాగే వాణిజ్య ప్రయోగ సేవలను సైతం విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచ భాగస్వామ్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఇది భవిష్యత్తు తరాల సామర్థ్యంతోపాటు స్వావలంబను మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
ఇస్రో బృందానికి అభినందనలు: సీఎం చంద్రబాబు
శ్రీహరికోట నుంచి ఎల్‌వీఎమ్3- ఎమ్6ను బుధవారం ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఈ సందర్భంగా ఇస్రో బృందానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. యూఎస్ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2 మోసుకెళ్లి.. అందుకు నిర్దేశించిన కక్ష్యలో ఈ ఉపగ్రహం ఉంచిందన్నారు. భారత్ నేలపై నుంచి ఇప్పటి వరకు అత్యంత బరువైన ఉప్రగ్రహాన్ని ప్రయోగించ లేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తాజాగా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడం ద్వారా మన దేశ వాణిజ్య అంతరిక్ష సామర్థ్యం, ప్రపంచ ప్రయోగ భాగస్వామిగా దాని స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. ఈ అద్భుతమైన మిషన్ విజయానికి దోహదపడిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు ఇలా ప్రతి ఒక్కరికీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
ఇది ముఖ్యమైన అడుగు: మంత్రి నారా లోకేశ్
బాహుబలి రాకెట్ అని పిలువబడే ఎల్‌వీఎమ్3 - ఎమ్ రాకెట్‌ను శ్రీహరికోట నుంచి ఈ రోజు విజయవంతంగా ప్రయోగించినందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లోని శాస్త్రవేత్తలు, సిబ్బందికి రాష్ట్ర ఐటీ విద్య శాఖ మంత్రి లోకేశ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారతదేశ వాణిజ్య ప్రయోగ సామర్థ్యాలను ప్రపంచం ఎదుట ప్రదర్శించడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగుగా ఆయన అభివర్ణించారు. రానున్న రోజుల్లో ఇస్రో మరిన్ని విజయాలు సాధించుకోవాలని కోరుకుంటున్నట్లు మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అనుకోకుండా తలుపు తట్టిన అదృష్టం..
చలితో వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు
For More AP News And Telugu News