KTR: ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:00 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు సంధించారు.
సిరిసిల్ల, డిసెంబర్ 10: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని.. అందుకోసం అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? అని వారు ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బుధవారం సిరిసిల్లలో కేటీఆర్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేవుళ్ళ మీద ఒట్టేసి మరీ సీఎం రేవంత్ మోసం చేశాడని మండిపడ్డారు. రూ. 2 లక్షల రుణ మాఫీ కావాలంటే రూ. 50 వేల కోట్లు కావాల్సి ఉంటుందన్నారు.
రూ. 12 వేల కోట్లతో కేవలం 25 శాతం మందికి మాత్రమే రుణ మాఫీ చేశారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనాయి సీఎం రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. తాము ఇచ్చిన ఉద్యోగాలను నువ్వు ఇచ్చినట్లు చెప్పుకుంటావా? అని సీఎం రేవంత్ రెడ్డిపై ఈ సందర్భంగా కేటీఆర్ నిలదీశారు. అధికారంలోకి వచ్చి.. రెండేళ్లు అయినా ఇంకా అబద్దాలే చెబుతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 420 హామీలు ఇచ్చి.. ఒక్కటీ అమలు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఈ పర్యటనలో ఇన్సురెన్స్ బాండ్లను కేటీఆర్ పంపిణీ చేశారు.
2023 ఏడాది చివరల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరింది. ఇక పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల ఫలితాలతో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఎన్నికల సమయంలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పలు హామీలు ఇచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా.. ఇంకా అమలు చేయడం లేదంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వరుసగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఓయూకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
అందుకే ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపు కాల్స్: డీసీపీ రాజేశ్
Read Latest Telangana News and National News