Share News

Local Body Elections: ఆఖరి యత్నం.. సెంటిమెంట్ అస్త్రం

ABN , Publish Date - Dec 17 , 2025 | 07:13 AM

గ్రామపంచాయతీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. నేడు మూడో విడత పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుతున్నారు. ఇంటింటికి వెళ్లి గడపకు బొట్టు పెట్టి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.

Local Body Elections: ఆఖరి యత్నం.. సెంటిమెంట్ అస్త్రం
Local Body Elections

హుజూరాబాద్ రూరల్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): అభ్యర్థులు ఇంటింటికెళ్లి ఓటర్లను కలిసి చివరియత్నంగా తమ గుర్తును తెలియజేస్తూ సెంటిమెంట్‌ను రాజేస్తున్నారు. అభ్యర్థులు భార్య పోటీ చేసిన చోట భర్తతో కలిసి ఇంటింటికెళ్లి ఓటరు ఇంటి గడపకు బొట్టుపెట్టి ఓటరుకు దండం పెడుతున్నారు. తనను తన గుర్తును మరిచిపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. మహిళా ఓటర్లకు అభ్యర్థులు దండం పెట్టి ఓటును అభ్యర్థిస్తున్నారు. మొదటి, రెండో విడుతల్లో చాలా గ్రామాల్లో ఇదే సూత్రాన్ని ఎంచుకున్న అభ్యర్థులు చివరి విడతలోనూ ఆఖరి ప్రయత్నంగా ఓటర్లకు దండం పెట్టి వాయినాలు చేతిలో పెట్టి ఓటేయాలని కోరే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో తాము ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది ? పోటీకి పెట్టిన ఖర్చు, ఓడిపోతే తమకు ఎదురయ్యే పరిస్థితులు.. అన్నీ వివరించి ఓటేయాలని కోరుతున్నారు. 15 రోజులుగా అభ్యర్థులు కాళ్లకు చక్రాలేసుకుని ఓటర్లకు వద్దకు తిరిగారు. గల్లీగల్లీకి తిరిగి గుర్తు చూపుతూ ప్రచారం చేశారు. పోలింగ్‌కు సమయం దగ్గరపడడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఓ వైపు పెట్టిన ఖర్చు, మరోవైపు ఇంత ఖర్చు చేసి ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందోనన్న భయందోళనలు నెలకొంటున్నాయి.


పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటూ కీలకంగా మారింది. ఎన్నికలు చలికాలంలోను వేడిని పుట్టిస్తున్నాయి. ఒక్క ఓటు కూడా సర్పంచ్ స్థానాన్ని తారుమారు చేసే అవకాశం ఉంటుంది. హోరాహోరిగా సాగుతున్న ప్రచారంలో అభ్యర్థులు ఏ ఒక్క ఓటునూ తక్కువగా తీసుకోవడం లేదు. చాలా గ్రామాల నుంచి వందమందికి పైగానే ఓటర్లు నగరాల్లో ఉంటున్నారు. దీంతో వారిని ఓటేసేందుకు రావాలంటూ చివరిరోజు ఫోన్లు చేసి అభ్యర్థులు కోరుతున్నారు. అన్నా బాగున్నారా.. ఎన్నికల్లో పోటీలో ఉన్నా. ఓటు వేసి వెళ్లాలని బతిమిలాడుతున్నారు. రానుపోను ఖర్చులు సైతం భరిస్తానమని కొన్ని గ్రామాల సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు తగిన ఏర్పాట్లు చేశారు. ఖర్చులకు డబ్బులు సైతం ముందస్తుగానే చెల్లిస్తున్నారు. ఒకే చోట ఎక్కువ మంది ఉంటే ప్రైవేట్ వాహనం అద్దెకు తీసు కొనిరావాలని, అద్దె కూడా తామే చెల్లిస్తామని హామీ ఇస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

వైభవ్ సూర్యవంశీని కట్టడి చేస్తాం: మలేసియా కెప్టెన్ డియాజ్

జట్టుకు సీఈవోలా ఫీలవ్వకూడదు.. గంభీర్‌కు హర్ష భోగ్లే హెచ్చరిక

Updated Date - Dec 17 , 2025 | 07:34 AM