Share News

Kalashwaram Project: పదేళ్లలో లక్ష కోట్లు కట్టాల్సిందే

ABN , Publish Date - Aug 06 , 2025 | 03:34 AM

అప్పు తీసుకొని ఒక వాహనం కొన్నాం. కొనుక్కున్న కొద్ది రోజులకే అది ప్రమాదానికి గురై, బాగా దెబ్బతింది. సాంకేతిక కారణాలతో దాన్ని బాగుచేయడానికి చాలా సమయం పడుతుందని సంబంధిత కంపెనీవాళ్లు చెప్పారు.

Kalashwaram Project: పదేళ్లలో లక్ష కోట్లు కట్టాల్సిందే

  • అప్పుడే సర్కారుకు కాళేశ్వరం అప్పు నుంచి విముక్తి

  • రుణాల రీస్ట్రక్చరింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం యత్నాలు

  • కుదరదని తేల్చిచెప్పిన బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు

  • ఆర్‌ఈసీ నుంచి అత్యధికంగా 10.90ు వడ్డీతో రుణం

  • కాళేశ్వరం కార్పొరేషన్‌ను నిరర్ధక ఆస్తిగా ప్రకటిస్తేనే రుణాల రీస్ట్రక్చర్‌

  • ఆర్‌ఈసీ స్పష్టీకరణ.. ప్రాజెక్టు నిరుపయోగం.. సర్కారుపై రుణ భారం!

హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): అప్పు తీసుకొని ఒక వాహనం కొన్నాం. కొనుక్కున్న కొద్ది రోజులకే అది ప్రమాదానికి గురై, బాగా దెబ్బతింది. సాంకేతిక కారణాలతో దాన్ని బాగుచేయడానికి చాలా సమయం పడుతుందని సంబంధిత కంపెనీవాళ్లు చెప్పారు. అంటే ఆ వాహనం మనకు ఉపయోగపడదు. కానీ, ఆ వాహనంపై తీసుకున్న రుణానికి అసలు, వడ్డీల రూపంలో వాయిదాలు చెల్లిస్తూనే ఉండాలి. ఓ వైపు వాహనాన్ని వినియోగించుకోలేకపోతుండగా.. మరోవైపు రుణ భారం మోయాల్సి వస్తుంది. గత ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పి, నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఇదే! ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది. కానీ, దానిపై తీసుకున్న రుణాలు రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారాయి. మరో పదేళ్లు చెల్లింపులు చేయాల్సి ఉంది. అసలు, వడ్డీ కింద రూ.లక్ష కోట్లకు పైనే చెల్లించాల్సి ఉంది. చిల్లిగవ్వ ఆదాయం లేకున్నా, ప్రాజెక్టులోని అత్యంత కీలకమైన లింక్‌-1 పూర్తిగా నిర్వీర్యం అయినా.. సర్కారును మాత్రం రుణభారం పట్టిపీడిస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం జాతీయ బ్యాంకులతో పాటు బ్యాంకింగేతర సంస్థలైన రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎ్‌ఫసీ)ల నుంచి రూ.87,449 కోట్ల రుణాలు మంజూరవగా.. అందులో రూ.71,566 కోట్లు విడుదలయ్యాయి. ఇక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా కాళేశ్వరం కార్పొరేషన్‌ ఖాతా నుంచి రూ.10,000 కోట్ల రుణం మంజూరవగా.. అందులో రూ.7,722 కోట్లు విడుదలయ్యాయి. ఈ అప్పులకు ప్రభుత్వం ఇప్పటిదాకా అసలు, వడ్డీ కలిపి రూ.29,737.06 కోట్లు చెల్లించింది. ఇంకా రూ.64,212 కోట్ల అసలు, పదేళ్లలో దానికి వడ్డీ కింద మరో రూ.41,638 కోట్లు.. వెరసి రూ.లక్ష కోట్లకుపైనే చెల్లించాల్సి ఉంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క ఆర్‌ఈసీ నుంచే రూ.30,536 కోట్ల రుణం మంజూరవగా.. అందులో రూ.16 వేల కోట్లను ప్రస్తుతం కట్టాల్సి ఉంది. ఇటీవలే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈఆర్‌సీ సీఎండీని కలిసి రుణాలను రీ షెడ్యూలింగ్‌ చేయాలని విజ్ఞప్తి చేసినా ఫలితం దక్కలేదు. అయితే కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ను నిరర్థక సంస్థ (ఎన్‌పీఏ)గా ప్రకటిస్తే.. రుణాలను రీ షెడ్యూల్‌చేస్తామని ఆర్‌ఈసీ తెలిపింది. అదే జరిగితే తెలంగాణ ప్రభుత్వ రుణ పరపతిపైనా తీవ్రప్రభావం పడనుంది.


స్వల్పకాలం.. వడ్డీ భారం

ఆర్‌ఈసీ నుంచి 10.90 శాతం వడ్డీకి స్వల్పకాలిక రుణం తీసుకోవడంతో చెల్లింపులు పెనుభారంగా మారాయి. దీంతో స్వల్పకాలిక రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా మార్చుకుంటే చెల్లింపుల ఖర్చు తగ్గి.. బడ్జెట్‌లో కేటాయించిన ప్రాజెక్టుల నిర్మాణాలకు వెచ్చించవచ్చని కాంగ్రెస్‌ సర్కారు భావించింది. ఈ విషయమై సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా కలిశారు. కాగా, కాళేశ్వరం కార్పొరేషన్‌కు పీఎ్‌ఫసీ నుంచి రూ.37,737 కోట్లు, ఆర్‌ఈసీ నుంచి రూ.30,536 కోట్లు మంజూరయ్యాయి. వీటిని దీర్ఘకాలిక రుణాలుగా మార్చి, రాయితీ లేదా వడ్డీని తగ్గించే అవకాశాలు ఉన్నాయా? అని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించగా.. అలాంటిదేం లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి జవాబు ఇచ్చారు. అయితే రుణాలు రీస్ట్రక్చరింగ్‌ అయితే భారం తగ్గుతుందని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో అప్పులు కట్టడానికే నిధులన్నీ కరిగిపోనున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రుణాలకు 2021-22లో వడ్డీ కింద రూ.143.74 కోట్లు.. అసలు రూ.69 కోట్లు కలిపి మొత్తం రూ.213.44 కోట్లు చెల్లించారు. 2022-23లో వడ్డీ ఏకంగా రూ.3375.83 కోట్లు కాగా.. అసలు రూ.1890.95 కోట్లు కలుపుకొని రూ.5266.78 కోట్లు కట్టాల్సి వచ్చింది. ఇక 2023-24లో రూ.10859.76 కోట్లు కిస్తీ కింది చెల్లించాల్సి ఉంది. 2024-25లో ఈ భారం రూ.13 వేల కోట్లకు చేరనుంది. ఇది 2033-34 సంవత్సరం దాకా ఉండనుంది. అంటే మరో పదేళ్లు ఇలా చెల్లింపులు చేస్తూ ఉంటేనే కాళేశ్వరం బాకీ తీరనుంది.


నిరుపయోగంగా ప్రాజెక్టు..

కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్‌-1 మూడేళ్లుగా నిరుపయోగంగానే ఉంది. ఏటా ఇందులో సమస్యలే. 2021 వరదలకు సిరిపురం(అన్నారం) పంప్‌హౌస్‌ నీట మునిగింది. 2022 వరదలకు కన్నెపల్లి(మేడిగడ్డ) పంప్‌హౌస్‌ పూర్తిగా దెబ్బతింది. పంప్‌హౌస్‌ రక్షణ గోడ మోటార్లపై పడడంతో మోటార్లు ధ్వంసమయ్యాయి. ఇక 2023 అక్టోబరు 21న మేడిగడ్డ బ్యారేజీలో 11 పిల్లర్లున్న ఏడో బ్లాకు కుంగింది. ఆ తర్వాత అన్నారం, సుందిళ్లలో సీపేజీలతో బుంగలు ఏర్పడ్డాయి. ఓ వైపు ప్రాజెక్టు రుణ భారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారగా.. మరోవైపు ప్రాజెక్టులోని లింక్‌-1 నిరుపయోగంగా మారింది.

కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల వివరాలు

సంస్థలు ఇచ్చిన రుణం వడ్డీ శాతం రీపేమెంట్‌ చెల్లింపు వాయిదాలు

(రూ.కోట్లలో) ముగిసేది

యూబీఐ 7400 8.25 30-6-2022 31-3-2034 48 త్రైమాసికాలు

పీఎన్‌బీ 11400 8.25 30-6-2022 31-3-2034 48 త్రైమాసికాలు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2150 8.25 30-06-2022 31-3-2034 48 త్రైమాసికాలు

పీఎఫ్‌సీ 25312 9.45,10.90 15-10-2022 15-7-2034, 48-144 వాయిదాలు

15-09-2034

నాబార్డ్‌ లోన్‌-1 1500 9.75 30-6-2021 31-3-2033 48త్రైమాసికాలు

నాబార్డ్‌ లోన్‌-2 4674.83 7.80 31-12-2022 30-09-2034 48 త్రైమాసికాలు

నాబార్డ్‌ లోన్‌-3 2051.14 7.80 30-9-2023 30-6-2035 48 త్రైమాసికాలు

ఆర్‌ఈసీ లింక్‌-1 4657.95 10.90 30-9-2023 30-8-2035 144 నెలలు

ఆర్‌ఈసీ లింక్‌-2 11784.70 10.90 1-6-2023 1-5-2035 144 నె లలు

ఆర్‌ఈసీ లింక్‌-4 14093 10.90 30-9-2023 30-8-2035 144 నెలలు


ఈ వార్తలు కూడా చదవండి

పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 06 , 2025 | 07:56 AM