Share News

Congress: ఇండీ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి నామినేషన్‌

ABN , Publish Date - Aug 22 , 2025 | 04:05 AM

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. గురువారం ఉదయం 11.30 గంటలకు రిటర్నింగ్‌ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోడీకి తన నామినేషన్‌పత్రాలు సమర్పించారు.

Congress: ఇండీ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి నామినేషన్‌

  • వెంట వచ్చిన సోనియా, రాహల్‌, పవార్‌.. కేజ్రీవాల్‌ ఇంటికి వెళ్లి కలిసిన సుదర్శన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. గురువారం ఉదయం 11.30 గంటలకు రిటర్నింగ్‌ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోడీకి తన నామినేషన్‌పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్‌ యాదవ్‌, డీఎంకే ఎంపి తిరుచ్చి శివ, శివసేన(యుబిటి) ఎంపీ సంజయ్‌ రావత్‌, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, టీఎంసీ ఎంపీ శతాబ్ది రాయ్‌, సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిటాస్‌, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌, ఇతర ప్రతిపక్ష నేతలు ఇండీ కూటమి అభ్య్థర్థి నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్లమెంట్‌ ఆవరణలో మహాత్మాగాంధీ, జ్యోతిబాఫూలే, అంబేద్కర్‌ విగ్రహాలకు నివాళులు అర్పించిన తర్వాత జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి తన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. నాలుగు సెట్లుగా సమర్పించిన నామినేషన్‌ పత్రాల్లో 200 మంది ఎంపీలు సంతకాలు చేశారు.


కేసీఆర్‌తో మాట్లాడతా: కేజ్రీవాల్‌

జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి గురువారం సాయంత్రం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆయన ఇంటికి వెళ్లి కలుసుకుని తనకు మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనను గెలిపించేందుకు తాను శాయశక్తులా ప్రయత్నిస్తానని కేజ్రీవాల్‌ చెప్పారు. బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడతానని ఆయన సుదర్శన్‌రెడ్డికి చెప్పినట్లు తెలిసింది. తాను కూడా రాష్ట్రాలకు వెళ్లి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని గెలిపించేందుకు ప్రయత్నిస్తానని కేజ్రీవాల్‌ అన్నారు. తృణమూల్‌ నేత కల్యాణ్‌ బెనర్జీ, కాంగ్రెస్‌ నేత ప్రమోద్‌ తివారీ సుదర్శన్‌రెడ్డితో పాటు కేజ్రీవాల్‌ను కలుసుకున్నారు. కేజ్రీవాల్‌ తన ఇంటి బయట మీడియాతో మాట్లాడుతూ, విప్‌ లేకుండా సీక్రెట్‌ బ్యాలట్‌ ద్వారా జరుగుతున్న ఎన్నికల్లో అన్ని పార్టీల ఎంపీలు నిర్భయంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. న్యాయమూర్తిగా దేశానికి అద్భుతమైన సేవ చేసిన జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి లాంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఉప రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చినట్లు అవుతుందని చెప్పారు. సుదర్శన్‌రెడ్డి కేవలం ప్రతిపక్షాల అభ్యర్థి కాదని, ఈ దేశ అభ్యర్థిగా భావించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రాధాన్యం ఉన్నందువల్ల రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలను జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి ఓటు వేయాలని కోరతానని చెప్పారు. తాను ఏ రాజకీయ పార్టీ సభ్యుడిని కాదని, ఉప రాష్ట్రపతి బాధ్యత రాజకీయ బాధ్యత కాదని సుదర్శన్‌రెడ్డి అన్నారు. స్వతంత్రంగా, నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన రాజ్యాంగ బాధ్యతను న్యాయమూర్తిగా కూడా నెరవేర్చానని చెప్పారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే అదే బాధ్యతను నెరవేరుస్తానని చెప్పారు.

త్వరలో అఖిలేష్‌, మమత, సొరేన్‌లతో భేటీ

కేజ్రీవాల్‌ను కలిసిన అనంతరం జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. శుక్రవారం సీనియర్‌ న్యాయవాది ప్రతా్‌పరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న తర్వాత ఆయన సాయంత్రానికి ఢిల్లీ తిరిగి వస్తారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత అన్ని పార్టీల ఎంపీలకు తనను గెలిపించాలని కోరుతూ లేఖలు పంపాలని ఆయన నిర్ణయించారు. ఈ నెల 26న సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ను కలుసుకునేందుకు జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి లక్నో వెళుతున్నారు. బెంగాల్‌కు వెళ్లి మమతా బెనర్జీని, జార్ఖండ్‌కు వెళ్లి హేమంత్‌ సోరెన్‌ను కూడా ఆయన కలుసుకోనున్నారు. తన పర్యటన కార్యక్రమాలను, ఇతర వ్యూహాలను ఇండియా కూటమికి చెందిన కోర్‌ కమిటీ సభ్యులు నిర్ణయిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా ఎన్డీఏ ముఖ్యమంత్రులను కలిసేందుకు కూడా ప్రయత్నించాలని సుదర్శన్‌రెడ్డి భావిస్తున్నారు. కేసీఆర్‌ను కూడా కలుసుకునేందుకు ప్రయత్నిస్తానని ఆయన సన్నిహిత వర్గాలకు తెలిపారు.


ఇది సైద్దాంతిక పోరు

జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగ విలువల పట్ల బాధ్యతతో, అచంచలమైన నిబద్ధతతో ప్రతిపక్ష ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశానని తెలిపారు. ఈ పోటీ ఒక వ్యక్తికి సంబంధించింది కాదని, పార్లమెంట్‌ పరస్పర గౌరవంతో నడిచేందుకు, అసమ్మతిని కూడా గౌరవించేందుకు, దేశంలో వ్యవస్థలు స్వతంత్రంగా ప్రజలకు సేవ చేసేందుకు జరుగుతున్న సైద్ధాంతిక పోరుగా దీన్ని భావించాలని, అది భారతీయ దృక్పథాన్ని ప్రతిబింబించాలని అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, లా విద్యార్థిగా, భారత రిపబ్లిక్‌ ప్రజాస్వామిక సంప్రదాయాలను జీర్ణించుకున్న పౌరుడిగా భారతదేశ నిజమైన శక్తి ఏమిటో తన జీవితంలో తెలుసుకున్నానని చెప్పారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్నత సంప్రదాయాలను పరిరక్షించే బాఽధ్యత రాజ్యసభ చైర్మన్‌గా ఉప రాష్ట్రపతికి ఉన్నదని, నిష్పాక్షికంగా, హుందాగా, పరస్పర చర్చలు, విలువల పట్ల మొక్కవోని అంకితభావంతో విధిని నిర్వహిస్తానని చెప్పారు. రాజ్యాంగం పట్ల గౌరవం, ప్రజల పట్ల విశ్వాసంతోనే ఈ ప్రయాణం ప్రారంభించానని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్

టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం

Read Latest AP News and National News

Updated Date - Aug 22 , 2025 | 04:05 AM