Share News

JEE Advanced 2025: హైదరాబాద్‌ జోన్‌ టాప్‌

ABN , Publish Date - Jun 03 , 2025 | 05:29 AM

జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదలయ్యాయి.

JEE Advanced 2025: హైదరాబాద్‌ జోన్‌ టాప్‌

  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో జాతీయస్థాయి టాప్‌-10లో మనోళ్లు ఇద్దరు

  • అత్యధికంగా 12,946 మంది అర్హత

  • ఢిల్లీ విద్యార్థి రజిత్‌ గుప్తాకు మొదటి ర్యాంకు

  • 332 మార్కులు సాధించిన విద్యార్థి

  • బాలికల్లో దేవదత్త మాఝీ ఫస్ట్‌ మొత్తం 1.80 లక్షల మంది పరీక్ష రాయగా..

  • అర్హత సాధించిన 54,378 మంది

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష నిర్వాహక సంస్థ ఐఐటీ కాన్పూర్‌ సోమవారం ఈ ఫలితాలను విడుదల చేసింది. జాతీయ ర్యాంకులతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలను ఏడు జోన్లగా విభజించి, జోన్ల వారీగా ఫలితాలను ప్రకటించారు. జాతీయస్థాయిలో ఢిల్లీకి చెందిన విద్యార్థి రజిత్‌ గుప్తా 360 మార్కులకు గాను 332 మార్కులతో ప్రథమ ర్యాంకు సాధించారు. 332 మార్కులతో ఢిల్లీకి చెందిన సక్షం జిందాల్‌ ద్వితీయ, 330 మార్కులతో ముంబైకి చెందిన మాజిద్‌ హుస్సేన్‌ తృతీయ స్థానంలో నిలిచారు. హైదరాబాద్‌కు చెందిన అర్ణవ్‌ సింగ్‌ 319 మార్కులతో 9వ ర్యాంకు; 317 మార్కులతో వడ్లమూడి లోకేశ్‌ 10వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. ఈ పరీక్షకు 116 మంది విదేశీ అభ్యర్థులు కూడా హాజరయ్యారు. వారిలో 13 మంది అర్హత సాధించారు. కాగా ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలను చదివి, మాక్‌ టెస్ట్‌ పేపర్లను జాగ్రత్తగా విశ్లేషించడం ద్వారా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో విజయం సాధించామని ప్రథమ, రెండో ర్యాంకర్లు రజిత్‌ గుప్తా, సక్షం జిందాల్‌ తెలిపారు. వీరిద్దరూ రాజస్థాన్‌లోని కోటలో ఒకే కోచింగ్‌ సెంటర్లో శిక్షణ పొందారు. జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌ విభాగంలో హైదరాబాద్‌ విద్యార్థి వంగాల అజయ్‌రెడ్డి జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. అలాగే ఓబీసీ నాన్‌ క్రీమీలేయర్‌ విభాగంలో హైదరాబాద్‌ నుంచి ధర్మాన జ్ఞాన రుత్విక్‌ సాయి జాతీయస్థాయిలో అగ్రగామిగా నిలిచి సత్తా చాటాడు.


ఐఐటీ జోన్లలో హైదరాబాద్‌ టాప్‌..

అత్యధికంగా అర్హత సాధించిన జోన్లలో హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఐఐటీ హైదరాబాద్‌ జోన్‌ నుంచి మొత్తం 12946 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 11370 మందితో ఢిల్లీ జోన్‌, 11226 మందితో ముంబై జోన్‌ వరగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. రూర్కీ 5445, ఖరగ్‌పూర్‌ 5353, కాన్పూర్‌ 5295, గువాహటి జోన్లో 2743 మంది అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా మొత్తం 1,80,422 మంది పరీక్షకు హాజరవగా.. 54,378 (30.13శాతం) మంది అర్హత సాధించారు. హైదరాబాద్‌ జోన్‌ నుంచి టాప్‌-10లో ఇద్దరు విద్యార్థులు ఉండగా, టాప్‌-100లో 23, టాప్‌-200లో 57, టాప్‌-300లో 78, టాప్‌-400లో 116, టాప్‌-500లో 139 మంది ర్యాంకులు సాధించారు. జేఈఈ మెయిన్స్‌ పరీక్ష దేశవ్యాప్తంగా 14,75,103 మంది హాజరయ్యారు. ఈ లెక్కన ఐఐటీల్లో ప్రవేశాలే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 14.75 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. చివరికి అర్హత సాధించింది కేవలం 54,378 మాత్రమే. అంటే మొత్తం అభ్యర్థుల్లో కేవలం 3.68 శాతం విద్యార్థులే అర్హత సాధించి ఐఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు హాజరు కానున్నారు. మొత్తం 23 ఐఐటీల్లో 17,740 సీట్లు భర్తీ చేయనున్నారు.

27.jpg


కామన్‌లో 74 మార్కులకు అర్హత..

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కామన్‌ ర్యాంకు లిస్ట్‌ (సీఆర్‌ఎల్‌)లో ప్రతి సబ్జెక్టులో కనీస మార్కులు 7, మొత్తం మార్కులు 74గా నిర్ణయించి అర్హులను ఎంపిక చేశారు. అలాగే ఓబీసీ, జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌ విభాగంలో సబ్జెక్టు మార్కులు 6, మొత్తం మార్కులు 66గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ విభాగం విద్యార్థులకు సబ్జెక్టులో కనీస మార్కులు 3, మొత్తం 37గా, ప్రిపరేటరీ కోర్సు (పీసీ) ర్యాంకు లిస్టులో కనీస సబ్జెక్టు మార్కులు 1, మొత్తం 18గా పరిగణనలోకి తీసుకున్నారు.


9404 మంది విద్యార్థినుల అర్హత

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు 54,378 మంది అర్హత సాధించగా.. వీరిలో 9404 మంది విద్యార్థినులు ఉన్నారు. ఖరగ్‌పూర్‌ జోన్‌కు చెందిన దేవదత్త మాఝీ జాతీయస్థాయిలో 16వ ర్యాంకు సాధించి బాలికల్లో టాపర్‌గా నిలిచారు. హైదరాబాద్‌ జోన్‌లో కోరికాన రసజ్ఞ టాపర్‌గా నిలిచారు. ఈమె జాతీయ స్థాయిలో 78వ ర్యాంకు సాధించారు. ఐఐటీ రూర్కీ నుంచి పీయూష దాస్‌ 29, ఢిల్లీ నుంచి లారిసా 59, ముంబై నుంచి అలీస్‌ పటేల్‌ 155, కాన్పూర్‌ నుంచి హర్షిత గోయల్‌ 434, గువాహటి నుంచి సౌమ్యా శ్రేయాసి 581వ ర్యాంకుతో బాలికల్లో జోన్‌ టాపర్లుగా నిలిచారు. మొత్తం అర్హత సాధించిన 54,378 విద్యార్థుల్లో జనరల్‌ విభాగంలో అత్యధికంగా 17273 మంది ఉండగా, ఓబీసీ 12606, ఎస్సీ 12499, జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌ 6414, దివ్యాంగులు 578 మంది ఉన్నారు.

హైదరాబాద్‌ పేరు కామన్‌ ర్యాంక్‌

జోన్‌ టాపర్లు (సీఆర్‌ఎల్‌)

1 అర్ణవ్‌ సింగ్‌ 9

2 వడ్లమూడి లోకేశ్‌ 10

3 ధర్మాన జ్ఞాన రుత్విక్‌ సాయి 18

4 వంగాల అజయ్‌రెడ్డి 19

5 అవనగంటి అనిరుధ్‌రెడ్డి 20


కామన్‌ పేరు మార్కులు జోన్‌

ర్యాంక్‌

1 రజిత్‌ గుప్తా 332 ఐఐటీ ఢిల్లీ

2 సక్షం జిందాల్‌ 332 ఐఐటీ ఢిల్లీ

3 మాజిద్‌ ముజాహిద్‌ హుసేన్‌ 330 ఐఐటీ ముంబై

4 పార్త్‌ మందార్‌ వర్తక్‌ 327 ఐఐటీ ముంబై

5 ఉజ్వల్‌ కేసరి 324 ఐఐటీ ఢిల్లీ

6 అక్షత్‌ కుమార్‌ చౌరాసియా 321 ఐఐటీ కాన్పూర్‌

7 సాహిల్‌ ముకేశ్‌దేవ్‌ 321 ఐఐటీ ముంబై

8 దేవేశ్‌ పంకజ్‌ భయ్యా 319 ఐఐటీ ఢిల్లీ

9 అర్ణవ్‌ సింగ్‌ 319 ఐఐటీ హైదరాబాద్‌

10 వడ్లమూడి లోకేశ్‌ 317 ఐఐటీ హైదరాబాద్‌

గురుకుల విద్యార్థుల ప్రతిభ

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో తెలంగాణ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలకు చెందిన 492 మంది పరీక్షకు హాజరవగా.. 97 మంది డైరెక్ట్‌ ర్యాంకులు, 132 మంది ప్రిపరేటరీ ర్యాంకులు సాధించారని గురుకుల కార్యదర్శి అలగు వర్షిణి తెలిపారు. తెలంగాణ గిరిజన గురుకులాల సంస్థ, ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌కు చెందిన 146 మంది విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని ఆ సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మి తెలిపారు. మొత్తం 285 మంది శిక్షణ పొందగా.. 8 మంది ఓపెన్‌ క్యాటగిరీలో ర్యాంకులు సాధించారని, 20 మందికి వెయ్యిలోపు ర్యాంకులు వచ్చాయని, 82 మందికి ఐఐటీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.


సత్తా చాటిన గిరిజన విద్యార్థులు

ఖమ్మం జిల్లా నుంచి ఎస్టీ విభాగంలో ఇద్దరు విద్యార్థులు సత్తా చాటారు. అజ్మీరా రోషిక్‌ మణిదీప్‌ జాతీయ స్థాయిలో 5వ ర్యాంక్‌, హసావత్‌ జశ్వంత్‌రామ్‌ 9వ ర్యాంక్‌ సాధించారు. ఇంజనీర్‌గా స్థిరపడాలనే లక్ష్యంతోనే చదువుతున్నట్లు రోషిక్‌ చెప్పాడు. భవిష్యత్తులో సివిల్‌ సర్వీసె్‌సలో స్థిరపడాలన్నది తన లక్ష్యమని జశ్వంత్‌రామ్‌ తెలిపాడు. మహబూబాబాద్‌ జిల్లా తూర్పుతండాకు చెందిన గుగులోతు హిమాన్షు ఎస్టీ విభాగంలో ఆలిండియా 12వ ర్యాంకు సాధించాడు.

మంచి గైడెన్స్‌తోనే..: అర్ణవ్‌ నిఘమ్‌

ఉపాధ్యాయులిచ్చిన మంచి గైడెన్స్‌తో చదవడం వల్లే ఆలిండియా ఓపెన్‌ క్యాటగిరీలో 11వ ర్యాంకు సాధించా. మాక్‌ టెస్టులు క్రమం తప్పకుండా రాయడంతో ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకుంటూ తర్వాత రాసే పరీక్షలో ఆ తప్పులు జరగకుండా జాగ్రత్త పడేవాణ్ణి. సబ్జెక్టులపై అవగాహన వచ్చే వరకు చదవడంతో పాటు పరీక్షల సమయంలో భయం లేకుండా రాశా. ఐఐటీ ముంబైలో చేరతా.


కంప్యూటర్‌ సైన్స్‌లో చేరతా: అజయ్‌రెడ్డి

పదో తరగతి నుంచి ఒక లక్ష్యంతో చదువుతుండడంతో ఆలిండియా ఓపెన్‌ క్యాటగిరీలో 19వ ర్యాంకు సాధించగలిగా. ఉదయం నుంచి రాత్రి వరకు ఎలాంటి ఒత్తిడి లేకుండా రోజూ మాక్‌ టెస్టులు రాశా. ఐఐటీ ముంబైలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరతా.

18 గంటలు ఇష్టంతో చదివా: జ్ఞాన రుత్విక్‌సాయి

రోజూ 18 గంటలు ఇష్టపడి చదవడం వల్లే ఓబీసీ విభాగంలో మొదటి ర్యాంకు సాధించా. చిన్నప్పటి నుంచి ఉన్నతస్థాయికి చేరాలనే లక్ష్యంతోనే చదువుతున్నా. ఐఐటీ ముంబైలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరతా.


మరికొన్ని ఉత్తమ ర్యాంకులు సాధించిన తెలుగు విద్యార్థులు..

ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గుణానుపురం గ్రామానికి చెందిన పల్ల భరత్‌చంద్ర ఆలిండియా ఓపెన్‌ క్యాటగిరీలో 21వ ర్యాంకు, ఓబీసీలో 2వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. విజయనగరం జిల్లాకు చెందిన పీతల ఆనంద చక్రవర్తి 118వ ర్యాంకు సాధించాడు. తెలంగాణలోని పరిగి విద్యార్థి కె.ప్రణవ్‌తేజ 136వ ర్యాంకు సాధించారు. ఏపీకి చెందిన ఎం.జయచంద్ర 169వ ర్యాంకు, పి.ఆదిత్య అభిషేక్‌ 257, జి.శ్రీరామశశాంక్‌ 281, జాగాన యోగేశ్వర్‌ 284, వై.శుభశ్రీవల్లీ ఆత్రేయి 296, పొట్నూరు కార్తీక్‌ 419వ ర్యాంకు సాధించారు.


ఈ వార్తలు కూడా చదవండి

బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..

చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 03 , 2025 | 05:29 AM