Share News

Justice Sudarshan Reddy: ఇండియా అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి

ABN , Publish Date - Aug 20 , 2025 | 03:49 AM

ఉపరాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని నిలబెట్టాలని ఇండియా కూటమి ఏకగ్రీవంగా నిర్ణయించింది.

Justice Sudarshan Reddy: ఇండియా అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి

  • ఉపరాష్ట్రపతి పదవికి సుప్రీం మాజీ జడ్జిని ఏకగ్రీవంగా ఖరారు చేసిన ప్రతిపక్ష కూటమి

  • రేవంత్‌, ఖర్గే మంతనాల్లో ఆయన పేరు

  • సుదర్శన్‌రెడ్డిని ఒప్పించింది రేవంత్‌రెడ్డే

  • పేరు చెప్పగానే కూటమి నేతలంతా ఆమోదం

  • ఖర్గే అభ్యర్థనపై ఢిల్లీకి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి

  • నేడు కూటమి నేతలతో పరిచయం

  • రేపు మధ్యాహ్నం అభ్యర్థిగా నామినేషన్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని నిలబెట్టాలని ఇండియా కూటమి ఏకగ్రీవంగా నిర్ణయించింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఇండియా కూటమి సమావేశంలో జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి పేరును కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా ప్రతిపాదించారు. ఇండియా కూటమి నేతలందరూ ముక్తకంఠంతో మద్దతు తెలిపారు. సమావేశంలో ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌, శివసేన-యూబీటీ నేతలు అరవింద్‌ సావంత్‌, సంజయ్‌ రావత్‌, తృణమూల్‌ నేత డెరెక్‌ ఓ బ్రెయిన్‌, డీఎంకే నేతలు కనిమొళి, తిరుచ్చి శివ, సమాజ్‌వాదీ పార్టీ నేత ధర్మేంద్ర యాదవ్‌, సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిటా్‌సతో పాటు కాంగ్రెస్‌ ఎంపీలు కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేశ్‌, ప్రమోద్‌ తివారీ పాల్గొన్నారు. సమావేశం బయట ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున సంజయ్‌ సింగ్‌ కూడా మద్దతును ప్రకటించారు. సమావేశం అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివిధ ప్రతిపక్ష పార్టీ నేతల సమక్షంలో సుదర్శన్‌రెడ్డి పేరును ప్రకటించారు. జసిస్‌ సుదర్శన్‌రెడ్డి దేశంలో అత్యంత ప్రముఖ న్యాయ నిపుణుడని, ప్రగతిశీల భావాలు కలిగిన ఆయన ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కీలకమైన సేవలు అందించారని తెలిపారు. ఆయన నిరంతరం సామాజిక ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం పోరాడారని చెప్పారు. ఉప రాష్ట్రపతి ఎన్నికను ఒక సైద్దాంతిక పోరుగా ఖర్గే అభివర్ణించారు. దేశ స్వాతంత్రోద్యమ విలువలు రాజ్యాంగంలోని ప్రజాస్వామిక స్ఫూర్తికి ప్రతీకగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి నిలిచినందువల్లే ఆయనను ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా ఎంచుకున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఈ విలువలపై దాడి జరుగుతోందని, అందుకే ఈ ఎన్నికల్లో కలిసికట్టుగా, పట్టుదలతో పోరాడాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 21న ఆయన నామినేషన్‌ దాఖలు చేస్తారని ఖర్గే తెలిపారు.


రేవంత్‌ కీలక పాత్ర

ఇండియా కూటమి సోమవారం అభ్యర్థి ఎంపికపై సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ఒక నిర్ణయానికి రాలేక పోయింది. దక్షిణాది నుంచే అభ్యర్థిని ఎంపిక చేయాలని అందరూ నిర్ణయించినప్పటికీ ఏ పార్టీ పేరును ప్రతిపాదించలేక పోయింది. డీఎంకే నేత తిరుచ్చి శివతో పాటు పలువురు పేర్లను చర్చించారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి పలు పేర్లు చర్చకు వచ్చాయి. తెలంగాణ ప్రస్తావన వచ్చినపుడు ఖర్గే.. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడినట్లు తెలిసింది. ఇరువురూ జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి పేరుపై చర్చించారు. ఆయనను ఒప్పించే బాధ్యతను రేవంత్‌కే అప్పగించారు. సోమవారం సాయంత్రం రేవంత్‌రెడ్డి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డితో చర్చించి ఆయనను ఒప్పించారని, ఆయన ఓకే అన్న తర్వాత ఖర్గేకు ఆ విషయం తెలిపారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మంగళవారం వివిధ పార్టీల నేతలతో అనధికారికంగా చర్చించినపుడు వారు కాంగ్రె స్‌ ప్రతిపాదనకు వెంటనే అంగీకరించారు. బీసీ కులగణన సర్వేను అధ్యయనం చేయడానికి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో స్వతంత్ర కమిటీని నియమించిన నేపథ్యంలో రాహుల్‌గాంధీ, ఖర్గే గతంలో ఆయనతో మాట్లాడారు.


రాహుల్‌ రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు కూడా సుదర్శన్‌రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యమైన తటస్థులైన వారి పేర్లు చర్చించినపుడు తెలంగాణ నుంచి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి పేరు ప్ర ముఖంగా ప్రస్తావనకు వచ్చింది. బీజేపీ భావజాలాన్ని బలంగా వ్యతిరేకిస్తున్న మేధావి మాత్రమే కాక సామాజిక న్యాయానికి తోడ్పడుతున్న వ్యక్తిగా సుదర్శన్‌రెడ్డి కంటే మంచి అభ్యర్థి లభించరని కాంగ్రెస్‌ అధిష్ఠానం అభిప్రాయపడింది. జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి ఖర్గే స్వయం గా ఫోన్‌ చేసి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఢిల్లీకి వెంటనే రమ్మని అభ్యర్థించారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న సుదర్శన్‌రెడ్డికి పలువురు ఇండియా కూటమి ఎంపీలు స్వాగతం చె ప్పారు. వారిలో కాంగ్రెస్‌ ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మల్లురవి తదితరులు ఉన్నారు బుధవారం ఇండియా కూటమి ఎంపీల భేటీలో సుదర్శన్‌రెడ్డిని పరిచయం చేస్తారు. గురువారం సుదర్శన్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ కూడా హాజరవుతారు.


ఈ వార్తలు కూడా చదవండి...

హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ.. సీఎం రేవంత్ ఫైర్

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 20 , 2025 | 03:49 AM