HYDRA: రూ.400 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా
ABN , Publish Date - Aug 22 , 2025 | 07:51 AM
ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై హైడ్రా మరోసారి కొరడా ఝుళిపించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాదాపూర్‌లోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో ఆక్రమణలను తొలగించింది. మెటల్ చార్మినార్ నమూనాకు ఎదురుగా హైటెక్‌సిటీ నుంచి కొండాపూర్ రహదారికి ఆనుకొని ఉన్న 3వేల చదరపు గజాల ప్రభుత్వ స్థలం సహా మొత్తంగా 16వేల చదరపు గజాల విస్తీర్ణంలోని పార్కులు, భారీ హోటల్ షెడ్డు, రహదారులపై ఉన్న ఇతర ఆక్రమణలను గురువారం హైడ్రా బుల్డోజర్లు నేలమట్టం చేశాయి.
- మాదాపూర్ జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో పార్కులు, రోడ్డు ఆక్రమణల తొలగింపు
- 16 వేల చదరపు గజాల స్థలం కబ్జా
- ప్రజావాణిలో ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో పరిశీలన
హైదరాబాద్ సిటీ: ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై హైడ్రా(Hydra) మరోసారి కొరడా ఝుళిపించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాదాపూర్‌లోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో ఆక్రమణలను తొలగించింది. మెటల్ చార్మినార్(Charminar) నమూనాకు ఎదురుగా హైటెక్‌సిటీ నుంచి కొండాపూర్ రహదారికి ఆనుకొని ఉన్న 3వేల చదరపు గజాల ప్రభుత్వ స్థలం సహా మొత్తంగా 16వేల చదరపు గజాల విస్తీర్ణంలోని పార్కులు, భారీ హోటల్ షెడ్డు, రహదారులపై ఉన్న ఇతర ఆక్రమణలను గురువారం హైడ్రా బుల్డోజర్లు నేలమట్టం చేశాయి.
1995లో మాదాపూర్‌లో 22 ఎకరాల విస్తీర్ణంలో 100 ప్లాట్లతో జూబ్లీ ఎన్‌క్లేవ్ పేరిట ఓ లేఅవుట్ అభివృద్ధి చేశారు. దీన్ని 2006లో ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఈ లేఅవుట్‌లో నాలుగు పార్కులున్నాయి. వీటిలో 8500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న రెండు పార్కులు కబ్జా అయ్యాయి. అలాగే 5 వేల చదరపు గజాల మేర రహదారిని ఆక్రమించారు. ఆక్రమణలు తొలగించిన 16వేల చదరపు అడుగుల స్థలం విలువ రూ.400 కోట్ల వరకు ఉంటుందని హైడ్రా ఒక ప్రకటనలో పేర్కొంది.
కాగా జూబ్లీ ఎన్‌క్లేవ్ లే అవుట్‌లోని పార్కు స్థలాలను నిబంధనల ప్రకారం జీహెచ్‌ఎంసీ పేరిట గిఫ్ట్ డీడీ చేయగా ప్రజావసరాల కోసం రహదారులు కేటాయించారు. పార్కులను జైహింద్‌రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారని జూబ్లీ ఎన్‌క్లేవ్‌కు చెందిన ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. లే అవుట్ పత్రాలు, డాక్యుమెంట్లు పరిశీలించి కబ్జా జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. ఆక్రమణలన్నీ తొలగించి పార్కు స్థలాలను కాపాడినట్లు అక్కడ బోర్డు ఏర్పాటు చేశారు. స్థలాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్టు సంస్థ పేర్కొంది.

కబ్జా చేసిన వారిపై కేసులు
హైటెక్‌సిటీ నుంచి కొండాపూర్ రహదారికి ఆనుకొని మెటల్ చార్మినార్ నమూనాకు ఎదురుగా 3వేల చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని జైహింద్ రెడ్డి ఆక్రమించి హోటల్, ఇతర వ్యాపారాలకు అద్దెకిచ్చి ఆదాయం పొందుతున్నాడు. అదే స్థలంలో ప్రకటనల కోసం హోర్డింగ్ ఏర్పాటు చేశారు. అద్దెలు, ప్రకటనల బోర్డు ద్వారా నెలకు అతడు రూ.4 లక్షల ఆదాయం పొందుతున్నట్టు పరిశీలనలో గుర్తించారు. సర్కారు జాగాలో హోటల్ నిర్మించి అద్దెకివ్వడంపై గతంలో జీహెచ్‌ఎంసీ కూడా నోటీసులు ఇచ్చింది.
2006లో లే అవుట్ రెగ్యులరైజ్ కాగా.. అనంతరం రద్దయినట్టు నకిలీ పత్రాలు సృష్టించారు. ఒకవేళ క్రమబద్ధీకరణ రద్దయినా కూడా యూఎల్‌సీ పరిధిలోని ఆ భూమి ప్రభుత్వ పరిధిలోకి వస్తుందే తప్ప జైహింద్‌రెడ్డికి ఎలా చెందుతుంది? అని ప్రజావాణిలో ఫిర్యాదుదారులు ప్రశ్నించారు. జైహింద్‌రెడ్డిపై భూకబ్జా కేసులున్నాయని అధికారులకు వివరించారు. ఈ నేపథ్యంలోనే విచారణ జరిపి హైడ్రా చర్యలకు ఉపక్రమించింది. కబ్జాకు పాల్పడిన వారిపై పోలీసు కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఆక్రమణల తొలగింపుపై స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆరు నెలలకే పుట్టిన శిశువుకు ప్రాణం పోసి..
Read Latest Telangana News and National News