Share News

TG News: హైదరాబాద్‌లో దొంగల హల్‌చల్.. భారీగా నగదు, బంగారం మాయం

ABN , Publish Date - May 17 , 2025 | 10:08 AM

Massive Theft in Hyderabad: దొంగలు మరోసారి రెచ్చిపోయారు. హైదరాబాద్‌లోని చాదర్ ఘాట్ పీఎస్ పరిధిలో దొంగతనానికి పాల్పడ్డారు. ఎంతో విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

TG News: హైదరాబాద్‌లో దొంగల హల్‌చల్.. భారీగా నగదు, బంగారం మాయం
Massive Theft in Hyderabad

హైదరాబాద్‌: నగరంలోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు హల్‌చల్ చేశారు. శుక్రవారం రాత్రి భారీ చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. దొంగతనం చేసిన విధానం చూస్తే ఇది సాధారణ దొంగతనంలా కాకుండా పక్కాప్లాన్‌తో చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇంతకీ చోరీ ఎక్కడ జరిగింది.. ఎవరింట్లో జరిగింది.. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

చాదర్‌ఘాట్‌కు చెందిన వ్యాపారి ఫహిముద్దీన్ ఇంట్లో దొంగలు పడ్డారు. 75 తులాల బంగారం సహా నగదు, ఖరీదైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఫహిముద్దీన్ భార్య అనారోగ్యంతో ఉండటంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు ఆమెను అడ్మిట్ చేయమని చెప్పడంతో అడ్మిట్ చేశాడు. ఫహిముద్దీన్ తన భార్య వద్దే ఆస్పత్రిలో ఉండగా.. ఇంటి వద్ద తన తల్లిదండ్రులను ఉంచాడు. ఇది పసిగట్టిన దొంగలు.. రాత్రి సమయంలో ఫహిముద్దీన్ ఇంట్లో చొరబడ్డారు. అతని తల్లిదండ్రులు ఉన్న గది తలుపులను బయటి నుంచి లాక్ చేశారు. ఆ తరువాత ప్రశాంతంగా చోరీకి పాల్పడ్డారు.


ఇళ్లంతా స్వేచ్ఛగా తిరిగారు. మెయిన్ హాల్, బెడ్ రూం మొత్తం వెతికారు. బీరువాలో ఉన్న బంగారం, నగదు తీసుకున్నారు. ఆ తరువాత ఫ్రిడ్జ్‌లోని పండ్లు తిని ఆ ఇంట్లోనే కొంత సమయం గడిపారు. అనంతరం అక్కడి నుంచి ఉడాయించారు. అయితే, శనివారం తెల్లవారుజామున ఆస్పత్రి నుంచి ఫహిముద్దీన్ ఇంటికి వచ్చాడు. ఇల్లంతా చిందరవందరగా పడి ఉండటాన్ని చూసి కంగారుపడిపోయాడు. గదిలోకి వెళ్లి బీరువా చూడగా తెరిచి ఉంది. అందులో ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బులు కనిపించలేదు. దీంతో చోరీ జరిగిందని భావించిన ఫహిముద్దీన్ పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయాన్ని ఖాకీలకు చెప్పాడు. ఇంట్లో బీరువాలో భద్రపరిచిన 75 తులాల బంగారు ఆభరణాలు, రూ. 2.50 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


ఫహిముద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చాదర్‌ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఈస్ట్, సౌత్ జోన్ క్లూస్ టీం కూడా సంఘటన స్థలానికి చేరుకుని దొంగల ఫింగర్ ప్రింట్లు, తదితర సాక్ష్యాలను సేకరించాయి. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అని క్లూస్ టీం అధికారులు పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న ఇతర ఇళ్లల్లోని సీసీ కెమెరాలను కూడా క్లూస్ టీం అధికారులు పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరు చూసిన పోలీసులు.. ఇది పక్కా ప్లాన్‌తో చేసినట్లుగా ఉందని భావిస్తున్నారు. ఎవరైనా తెలిసిన వ్యక్తులు ఈ చోరీకి పాల్పడ్డారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

KTR: సురేఖ తెగించి కమీషన్‌ మంత్రుల పేర్లు చెప్పాలి

High Court: 132 కిలోల మత్తుపదార్థాల పట్టివేత కేసులో బెయిల్‌ ఇవ్వలేం: హైకోర్టు

Fake Cotton Seeds: 40 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 17 , 2025 | 11:02 AM