Mallu Bhatti Vikramarka: వాస్తవాలు చెబితే.. తప్పు పట్టిన బీఆర్ఎస్
ABN , Publish Date - Sep 08 , 2025 | 03:24 PM
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు ఆ పార్టీలోని నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆర్థిక సంక్షోభం సృష్టించారని విమర్శించారు. కాళేశ్వరంలో హరీష్, సంతోష్‌లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 08: బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మరోసారి నిప్పులు చెరిగారు. పాలన పరంగా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించారని విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మేడిగడ్డ అంశంపై తాము మాట్లాడితే.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని తెలిపారు.
మేడిగడ్డ కుంగిందని వాస్తవాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారన్నారు. హరీష్ రావు, సంతోష్ రావులు కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో దోచుకోవడం వల్లే.. కేసీఆర్ రెండో సారి తన కేబినెట్‌లో హరీశ్ రావును అవకాశం ఇవ్వలేదని ఆయన వివరించారు.
తెలంగాణలో పాలనతోపాటు ఆర్థిక పరంగా గాడిన పెడుతున్నామని చెప్పారు. పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ కార్యక్రమం చరిత్రలో నిలిచి పోతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. అధికారంలోకి రాగానే రుణ మాఫీ చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు రైతు భరోసా కింద ఇచ్చామన్నారు. దేశంలోనే రైతులకు ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ చేసిందని పేర్కొన్నారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.. దాదాపు రూ. లక్ష కోట్లు సంక్షేమ కోసం ఖర్చు చేసిందన్నారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ కుల గణన చేస్తామన్నారని.. ఆ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కుల గణన చేసి చూపించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇక స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ల కోసం బిల్లులు తీసుకొని వచ్చామన్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. రిజర్వేషన్లకు ముకుతాడు వేసిందని విమర్శించారు. ఎల్లంపల్లి, నెట్టెంపాడు ,శ్రీశైలం, నాగార్జున సాగర్, దేవాదుల ప్రాజెక్టులు మనమే నిర్మించామని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన గుర్తు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వాస్తవాలు చెబితే.. తప్పు పట్టిన బీఆర్ఎస్
ఆధార్‌ను అంగీకరించాల్సిందే.. ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశం
For More TG News And Telugu News