CM Revanth Reddy: సీఎం కీలక ప్రకటన
ABN , Publish Date - Sep 01 , 2025 | 07:23 PM
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 01: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు, వరదల నష్టంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో సమీక్షించారు. వర్షాల కారణంగా 1,052 చోట్ల 1,023 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని సీఎం దృష్టికి ఉన్నతాధికారులు తీసుకువెళ్లారు. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని వారిని ఆదేశించారు.
అలాగే గతేడాది భారీ వర్షాలకు జరిగిన నష్టానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు రాక పోవడంపై సీఎం ఆరా తీశారు. ఈ అంశాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లాలని ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. ఇక భారీ వర్షాల సమయంలో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని చెరువుల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేయాలని చెప్పారు.
ఇప్పటి వరకు విపత్తు నిర్వహణ నిధుల కింద చేపట్టిన పనుల వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్లను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలు, వరదల కారణంగా జరిగిన పంట నష్టం అంచనా వేసి తక్షణమే నివేదిక సైతం అందజేయాలని సూచించారు.
గత ఏడాది ఏర్పాటు చేసిన ఎస్డీఆర్‌ఎఫ్.. వరదల సమయంలో బాగా పని చేసిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆ క్రమంలో ఎన్డీఆర్‌ఎఫ్‌తో పని లేకుండా ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందిలో నైపుణ్యాలు పెంచాల్సిన ఆవశ్యకతను ఈ సందర్బంగా ఉన్నతాధికారులకు సీఎం వివరించారు. హెచ్ఎండీఏ పరిదిలో చెరువులను వెంటనే నోటిఫై జరగాలని ఆదేశించారు.
అయితే వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందజేయాలని అధికారులకు సూచించారు. అలాగే చనిపోయిన జంతువులకు సైతం పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ఈ సందర్భంగా కలెక్టర్లకు స్పష్టం చేశారు. కింద స్థాయి అధికారులు కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు జిల్లాలోనే ఉండి నిరంతరం అప్రమత్తంగా ఉండి.. పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌పై సమగ్ర నివేదిక తయారు చేసి కేంద్రానికి అందజేయాల్సి ఉందని అధికారులకు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News