Telangana BC Reservations: బీసీలకు దసరా కానుకగా 42% రిజర్వేషన్లు: తెలంగాణ మంత్రులు
ABN , Publish Date - Sep 29 , 2025 | 02:06 PM
కులగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామని తెలంగాణ మంత్రులు అన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని... ఎవరి నోటి కాడ ముద్ద లాక్కోవడం లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 29: ప్రజలందరికీ మంత్రులు పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar), వాకిటి శ్రీహరి (Minister Vakati Srihari) బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం గాంధీభవన్‌లో మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. దసరా కంటే ముందే బీసీ బిడ్డలకు పండుగ వాతావరణం వచ్చిందన్నారు. మాతృమూర్తికి ప్రసవ వేదన అనేది ప్రకృతి ఇచ్చిన వరమని.. అలాగే 42 శాతం రిజర్వేషన్లు బీసీ బిడ్డలకు ఇచ్చిన వరంగా పేర్కొన్నారు. ‘మేము ఎంతో మాకు అంతా వాటా’ అని రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కులగణన చేశారని.. కులగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని... ఎవరి నోటి కాడ ముద్ద లాక్కోవడం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి బీసీలకు రిజర్వేషన్లలలో ఇంకా వాటా రావాలి కానీ కుదించుకొని 42 శాతం రావాలి అని అడుగుతున్నామని చెప్పుకొచ్చారు.
పార్టీ మెప్పు కోసం, నాయకుల మెప్పు కోసం ఎవరూ మాట్లాడి సమాజంలో తలవంపులు తెచ్చుకోవద్దని అన్ని పార్టీల బీసీ నాయకులకు తాము కోరుతున్నామన్నారు. ఇది న్యాయపరమైన కోరికగా వెల్లడించారు.రిజర్వేషన్లు అమలు కాకపోతే బీసీ బిడ్డలు ఇంకా వెనకబడిపోతారన్నారు. జయలలిత బీసీ రిజర్వేషన్లు పెంచి 9 షెడ్యూలు పెట్టినప్పుడు జయలలిత పార్టీ కేంద్రంలో అధికారంలో లేదని తెలిపారు. రాష్ట్రాల్లో ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి కేంద్రం బిల్లుకు ఆమోదం తెలపాలని అన్నారు. ‘అంతేకాని మీరే హామీ ఇచ్చారు.... మీరే చేయాలి అని బట్ట కాల్చి మీద వేస్తాం అంటే ఎలా?’ అని మండిపడ్డారు.
రాష్ట్ర పరిధిలో ఉన్న అన్ని ప్రయత్నాలు చేశామని....ఇప్పుడు కేంద్రం చేయాలన్నారు. అది చేయకపోగా అనుమానాలు ఉన్నాయి అంటున్నారని... అనుమానాలు ఉంటే వ్యక్తం చేయమని కూడా చెప్పామన్నారు. అవేమీ చేయకుండా బీజేపీ నాయకులు కాళ్లలో కట్టే పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ బిడ్డలందరికీ పోటీ చేసే అవకాశం దొరికింది... దయచేసి అన్ని వర్గాలు సహకరించాలని, 42 శాతం రిజర్వేషన్లు వ్యతిరేకించి బీసీ బిడ్డల ఆగ్రహానికి గురికావద్దని మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీహరి కోరారు.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్లో నటి కాబోయే భర్త ఆత్మహత్య
పండుగ సందడి... ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిట
Read Latest Telangana News And Telugu News