Telangana High Court: డీజీపీ నియామక ఉత్తర్వులు రద్దుకు నిరాకరించిన హైకోర్టు
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:52 PM
తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డిని ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. ఈ నియామకాన్ని హైదరాబాద్‌కు చెందిన సోషల్ వర్కర్ టి. మధన్ గోపాల్ రావు హైకోర్టులో సవాల్ చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 24: రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వులు రద్దు చేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. రెండు వారాల్లోగా డీజీపీల ప్యానెల్ లిస్టును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా డీజీపీ ఎంపిక ఉండాలని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ప్యానెల్ లిస్టును యూపీఎస్సీకి పంపిన తర్వాత కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది.
ఇటీవల తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. ఈ నియామకాన్ని హైదరాబాద్‌కు చెందిన సోషల్ వర్కర్ టి. మధన్ గోపాల్ రావు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం జారీ చేసిన డీజీపీ నియామక ఉత్తర్వులు 2018 నాటి సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్ లైన్స్‌కు పూర్తి వ్యతిరేకమంటూ పిటిషనర్ వ్యక్తిగతం హాజరై ఈ కేసును హైకోర్టులో వాదించారు. డీజీపీ పదవి విరమణకు కనీసం 3 నెలల ముందుగానే యూపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ భర్తీ వివరాలను సమర్పించాల్సి ఉందన్నారు.
అర్హులైన ఐపీఎస్ అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దాంతో శాశ్వత నియామక ప్రక్రియ ఆగిందని వివరించారు. అనంతరం ఈ పిటిషన్‌పై హైకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా డీజీపీ నియామక ఉత్తర్వులు రద్దు చేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
లక్షల్లో శిశువుల విక్రయం.. 12 మంది అరెస్ట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో షాకింగ్ ఆధారాలు...
Read Latest Telangana News And Telugu News