MLAs Meeting with Kharge: అలిగిన ఎమ్మెల్యేలు.. ఖర్గే బుజ్జగింపులు
ABN , Publish Date - Jul 03 , 2025 | 09:12 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్‌లో చోటు దక్కని ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చర్యలు చేపట్టారు. అందులో భాగంగా హైదరాబాద్ చేరుకున్న ఆయన.. వారితో విడివిడిగా సమావేశమయ్యారు.
హైదరాబాద్, జులై 03: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్‌లో చోటు దక్కని అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున్ ఖర్గే నిమగ్నమయ్యారు. గురువారం రాత్రి తాజ్ కృష్ణా హోటల్‌లో ఖర్గేను ఎమ్మెల్యేలు ప్రేమసాగర్ రావు, మల్‌రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ తదితరులు విడివిడిగా కలిశారు. ఈ సందర్భంగా తాము మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నామని పార్టీ అధినేత ఖర్గేకు వివరించారు. ఈ సందర్భంగా వారితో ఖర్గే కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఆ క్రమంలో తొలుత ఖర్గేతో ప్రేమసాగర్ రావు సమావేశమయ్యారు. కేబినెట్‌లో చోటు కల్పించలేమంటూ ప్రేమ సాగర్ రావుకు ఖర్గే స్పష్టం చేశారు. అయితే చీఫ్ విప్ హోదా కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ ఆఫర్‌ను ఆయన తిరస్కరించారు. అనంతరం అక్కడి నుంచి ప్రేమ సాగర్ రావు అలిగి వెళ్లిపోయారు. దీంతో ఆయన్ను బుజ్జగించేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రంగంలోకి దిగారు.
మరోవైపు రెడ్డి సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం ఉండక పోవచ్చని పలువురు ఎమ్మెల్యేలకు ఖర్గే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రావులు అసంతృప్తిగా బయటకి వెళ్లిపోయారు. అలాగే మంత్రివర్గంలో సీనియర్లకు అవకాశం కల్పించాలని ఖర్గేను సుదర్శన్ రెడ్డి కోరారు. దీంతో ఆయనకు సైతం ఖర్గే సమాధానం ఇచ్చినట్లు సమాచారం.
ఇంకోవైపు బంజారాలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలంటూ ఎమ్మెల్యే బాలు నాయక్ కోరారు. దీనిపై ఖర్గే స్పందిస్తూ.. కష్టపడితే అవకాశాలు ఉంటాయని బాలు నాయక్‌తో ఖర్గే చెప్పినట్లు సమాచారం. ఇక తనకు ముందస్తు కార్యక్రమం కారణంగా.. ఈ సమావేశానికి రాలేకపోతున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. పార్టీ సీనియర్లకు తెలిపారు. అయితే తనకు ఫోన్ కాల్ రాలేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వెల్లడించారు.
ఇక, ఖర్గేతో భేటీ అనంతరం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. ఖర్గే తమకు సమయం ఇచ్చి మాట్లాడారన్నారు. ఒక్కొక్కరిని విడివిడిగా పిలిచి మాట్లాడారని చెప్పారు. తాము చెప్పిన మాటలు ఖర్గే శ్రద్ధగా విన్నారని.. ఉమ్మడి 10 జిల్లాకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశామన్నారు. ఇచ్చిన జిల్లాకే మంత్రి పదవులు ఇస్తే బాగోదని తాము సూచన చేశామన్నారు. రాష్ట్ర జనాభాలో 45 శాతం జనాభా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తు చేశామన్నారు. సగం స్టేట్‌కి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని పరిస్థితిని ఖర్గేకు వివరించామన్నారు మల్ రెడ్డి రంగారెడ్డి.
ఇవి కూడా చదవండి
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్
రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..
తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్
Read latest Telangana News And Telugu News