Neera Cafe: నీరా కేఫ్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:13 PM
Neera Cafe: హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో గల నీరా కేఫ్‌ను తొలగిస్తుందని ప్రచారం జరిగింది. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.

హైదరాబాద్: హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఉన్న నీరా కేఫ్‌ను తొలగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. ఈ మేరకు నీరా కేఫ్‌పై ఎక్సైజ్ శాఖ అధికారులు ఇవాళ(ఆదివారం) ఓ ప్రకటన విడుదల చేశారు. నీరా కేఫ్‌ను మూసివేయాలనే ప్రతిపాదనలు తమకు లేవని స్పష్టం చేశారు. మొదటి నుంచి ఫుడ్ కోర్టులు కేఫ్‌లో భాగంగానే ఉన్నాయని తెలిపారు. నీరా కేఫ్‌ను తొలగించి అక్కడ హోటళ్లు ఏర్పాటుచేసే ప్రతిపాదనలు లేవని తేల్చిచెప్పారు. నీరా కేఫ్‌ను డాక్టర్ వినోద్ గౌడ్‌కు చెందిన మెస్సర్స్ తనీరా పామ్ ప్రొడక్ట్స్ డెవలప్‌మెంట్ సొసైటీ నిర్వహిస్తోందని తెలిపారు. నీరా కేఫ్ ఇప్పటికీ తన కార్యకలాపాలను కొనసాగిస్తోందని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది.
నీరా ఆరోగ్యానికి మంచిది..
హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో సుమారు రూ.12 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో నీరాకేఫ్‌ను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాటిమొద్దులు, ఈత మొద్దులపై కూర్చోడానికి వీలుగా సీట్లను డిజైన్ చేశారు. వాటిపై కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ నీరా తాగడానికి ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి ఫుడ్ స్టాల్‌లో తెలంగాణ వంటకాలను సైతం వడ్డిస్తారు. గీతకార్మికుల అస్తిత్వానికి ప్రతీకగా నీరాకేఫ్ ఉంది. ఇతర పానీయాలతో పోల్చితే నీరా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇప్పటి వరకు కాంబోడియా, ఆఫ్రికా, ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక వంటి దేశాల్లో నీరా ఉత్పత్తి అధికంగా ఉంది. హైదరాబాద్ నగరంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన నీరాకేఫ్ నగరజీవులకు కొత్త రుచులు అందిస్తోంది. పక్కనే హుస్సేన్‌సాగర్.. చిటపట చినుకులు పడుతూ ఉంటే.. వెచ్చగ గొంతులోకి నీరా దిగుతూ ఉంటే.. చెప్పలేని ఆ హాయి కోసం ఇక్కడికి ఎంతోమంది వచ్చి సేద తీరుతుంటారు.
35 ఆస్తులు లీజుకు...
కాగా.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల వద్ద నిర్మించిన హోటళ్లు, రెస్టారెంట్లు, స్థలాలను ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొదిస్తుంది. పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన సుమారు 35 ఆస్తులను లీజుకు ఇవ్వనున్నారని విశ్వసనీయంగా తెలిసింది. పర్యాటక ప్రాంతాల్లో విశాలమైన ప్రదేశాల్లో, వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్మించిన ఈ వసతి సదుపాయాల నిర్వహణ అనుకున్నంత మెరుగ్గా లేదని.. సర్కారు భావిస్తోంది. పర్యాటక ప్రదేశాల ప్రాముఖ్యం, మనోహర దృశ్యాల దృష్ట్యా వస్తున్న సందర్శకులు.. అక్కడున్న వసతి కూడా బాగుందని భావిస్తే ఆ విషయం విస్తృత ప్రచారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. అది రాష్ట్రానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకుల సంఖ్యను కూడా పెంచేందుకు ఉపకరిస్తుంది. ఇదే ఉద్దేశంతో పర్యాటక సంస్థ నడుపుతున్న పలు ఆస్తులను ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది.
సుమారు రూ.400 కోట్లకు పైగా పర్యాటక సంస్థకు లీజు బకాయిలు రావాల్సి ఉందని అంచనా. ఎప్పటికప్పుడు లీజు మొత్తాన్ని వసూలు చేయడానికి అవసరమైన యంత్రాంగం పర్యాటక సంస్థలో అందుబాటులో లేకపోవడంతో రూ.వందల కోట్ల మేర బకాయిలు పేరుకుపోయినట్టు ఆరోపణలున్నాయి. రాజకీయ సిఫారసులతో పర్యాటక సంస్థ ఆస్తుల లీజు దక్కించుకున్న కొందరు బడా బాబులు రూ. కోట్ల బకాయిలు చెల్లించకుండా ముఖం చాటేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Crime News: రాజలింగమూర్తి హత్య ఎలా జరిగిందంటే..: ఎస్పీ కిరణ్ ఖరే
Yadadri: ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని స్వామికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Read Latest Telangana News and Telugu News