CM Revanth Review Meeting: సంక్షేమ హాస్టళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక సూచనలు
ABN , Publish Date - Oct 13 , 2025 | 03:03 PM
విద్యార్థులకు అందించే భోజనం క్వాలిటీ చెక్‌కు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని.. విద్యార్థులకు సరైన పోషకాలతో కూడిన పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్, అక్టోబర్ 13: సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష సమావేశం ముగిసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ విభాగాల పనితీరు, పథకాల అమలుపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. పూర్తిస్థాయి డేటాతో సంక్షేమ హాస్టళ్ల వ్యవస్థలో అకౌంటబిలిటీ ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. హాస్టళ్లలో విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని పూర్తిగా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. విద్యార్థులకు అందించే భోజనం క్వాలిటీ చెక్‌కు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని.. విద్యార్థులకు సరైన పోషకాలతో కూడిన పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
హాస్టళ్లలో విద్యార్థులకు అందించే దుస్తులు, పుస్తకాలు వారికి చేరుతున్నాయో లేదో ధ్రువీకరించాలని తెలిపారు. మౌలిక వసతులకు సంబంధించి ప్రతీ హాస్టల్‌లో పరిస్థితులపై పూర్తిస్థాయి డేటాను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్డేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని.. ఇందుకు అవసరమైన టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచనలు చేశారు సీఎం. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విధానం అనుసరించాలన్నారు. ఇందుకు సంబంధించి ఏరియలవారీగా హాస్టళ్లను సమీపంలో ఉన్న మెడికల్ కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్‌తో లింక్ చేయాలని ఆదేశించారు. తరచూ హాస్టళ్లను సందర్శించి హెల్త్ చెకప్స్ చేసేలా చూడాలన్నారు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి.. ప్రతీ నెలా గ్రీన్ ఛానల్‌లో నిధులు అందించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
కాగా.. వివిధ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (సోమవారం) సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
రైతులతో కలిసి సీఆర్డీఏ భవనాన్ని ప్రారంభించిన సీఎం
జువైనల్ హోంలో లైంగిక దాడిపై పోలీసులు ఏం తేల్చారంటే
Read Latest Telangana News And Telugu News