Revanth Reddy Government: రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ABN , Publish Date - Dec 19 , 2025 | 08:26 PM
రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్లు, డైరెక్టర్ల పాలక వర్గాలను రద్దు చేసింది. అలాగే తొమ్మిది జిల్లాల డీసీసీబీలను సైతం తొలగించింది.
హైదరాబాద్, డిసెంబర్ 19: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్లు, డైరెక్టర్ల పాలక వర్గాలను రద్దు చేసింది. అలాగే తొమ్మిది జిల్లాల డీసీసీబీలను సైతం తొలగించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ డీసీసీబీల పాలకమండళ్ల కాలపరిమితి ముగియడంతో రద్దు చేసినట్లు తెలిపింది.
ఈ మేరకు పీఏసీఎస్‌లకు పర్సన్ ఇన్‌ఛార్జిలను నియమించాలని వ్యవసాయశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఇన్‌ఛార్జిలు కొనసాగుతారని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీతో పీఏసీఎస్‌ల పదవీకాలం ముగిసిందని ప్రభుత్వం వివరించింది.
వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సహకార సొసైటీల నిర్వహణకు ఎన్నికల ద్వారా పాలకవర్గాలను నియమిస్తుంది. సొసైటీల సామర్థ్యాలకు అనుగుణంగా చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు ఉంటారు. ఎన్నికైన పాలకవర్గాలు ప్రభుత్వం ద్వారా వ్యవసాయ, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి రైతుల సంక్షేమానికి అమలయ్యే పథకాలను అందిస్తాయి.
ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల ద్వారా ఈ పాలకవర్గాలను ప్రభుత్వం నియమిస్తుంది. 2020, ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రభుత్వం ఈ ఎన్నికలను నిర్వహించింది. ఈ ఎన్నికల ద్వారా పదవులు పొందిన వారి పదవి కాలం ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది. వారి పదవి కాలాన్ని ఆరు నెలల పొడిగించింది. తాజాగా పాలకవర్గాలను రద్దు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రూ. 500 నకిలీ నోట్ల కలకలం.. రైతును అదుపులోకి తీసుకున్న పోలీసులు
నియామకాల్లో పారదర్శకత ముఖ్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
For More Telangana News And Telugu News