Ponnam Adluri Dispute Resolved: సహచర మంత్రులు బాధ్యతాయుతంగా మాట్లాడండి: పీసీసీ చీఫ్
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:39 PM
మంత్రుల మధ్య జరిగిన సంఘటన కుటుంబ సమస్యగా వెల్లడించారు. జరిగిన సంఘటన పట్ల చింతిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 8: తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య చెలరేగిన వివాదానికి తెరపడింది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) నివాసంలో ఇరువురు మంత్రుల మధ్య సయోధ్య కుదిరింది. ఈరోజు ఉదయం పీసీసీ చీఫ్ నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో అడ్లూరికి పొన్నం క్షమాపణలు చెప్పారు. దీంతో ఇరువురి మధ్య వివాదం ముగిసింది. దీనిపై పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. మంత్రి పొన్నం ప్రభాకర్ చేశారన్న వ్యాఖ్యల పట్ల మరో మంత్రి లక్ష్మణ్ నొచ్చుకోవడంతో యావత్ సమాజం కొంత బాధపడిందన్నారు. మంత్రుల మధ్య జరిగిన సంఘటన కుటుంబ సమస్యగా వెల్లడించారు. జరిగిన సంఘటన పట్ల చింతిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పారన్నారు.
మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కష్టపడి పైకొచ్చిన నేతలని తెలిపారు. ఈ సమస్య ఇంతటితో సమసిపోవాలని యావత్ మాదిగ సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు పీసీసీ చీఫ్. ఎక్కడ మాట్లాడినా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సహచర మంత్రివర్గానికి కూడా విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ అని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఆశయాన్ని ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహాయంతో కుల సర్వే పారదర్శకంగా నిర్వహించామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మూడు చట్టాలు తీసుకొచ్చామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
పార్టీ లైన్ దాటను: లక్ష్మణ్
పొన్నం క్షమాపణ కోరడంతో ఈ సమస్య ఇంతటితో సమసిపోయిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. పొన్నం ప్రభాకర్‌ను గౌరవిస్తా.. కానీ ఆయన వాఖ్యల పట్ల మాదిగ జాతి బాధపడిందన్నారు. అట్టడుగు సామాజిక వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు. జెండా మోసిన తనకు మంత్రిగా అవకాశం ఇచ్చారని... పార్టీ లైన్ దాటే వ్యక్తిని కానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
అడ్లూరిపై వ్యాఖ్యల ఎఫెక్ట్... పొన్నం ఇంటి వద్ద భద్రత పెంపు
అడ్లూరి నాకు సోదరుడు.. కలిసే ముందుకెళ్తాం: పొన్నం
Read Latest Telangana News And Telugu News