Telangana Ministers Dispute: మంత్రుల మధ్య ముగిసిన వివాదం
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:08 PM
లక్ష్మణ్‌కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్తున్న... కరీంనగర్‌లో మాదిగ సామాజిక వర్గంతో నేను కలిసి పెరిగానని మంత్రి పొన్నం తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 8: తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar), అడ్లూరి లక్ష్మణ్ (Minister Adlurii Laxman) మధ్య వివాదం ముగిసింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) చొరవతో ఇద్దరి మధ్య వివాదానికి తెరపడినట్లైంది. ఎట్టకేలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పారు. ‘లక్ష్మణ్ బాధ పడిన దానికి నేను క్షమాపణలు కోరుతున్న. లక్ష్మణ్‌కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్తున్న. కరీంనగర్‌లో మాదిగ సామాజిక వర్గంతో నేను కలిసి పెరిగా’ అంటూ మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు.
కాగా.. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో అడ్లూరిని ఉద్దేశించి పొన్నం అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో రచ్చ చెలరేగింది. పొన్నం వ్యాఖ్యలను అడ్లూరి తీవ్రంగా ఖండించగా.. తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని పొన్నం చెప్పుకొచ్చారు. ఈ వివాదం చిలికిచిలికి గాలి వానగా మారింది. ఈ క్రమంలో మంత్రుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పీసీసీ చీఫ్ రంగంలోకి దిగారు. అందులో భాగంగానే ఈరోజు ఉదయం పీసీసీ చీఫ్ నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రులు పొన్నం, అడ్లూరి హాజరయ్యారు. ఇద్దరు మంత్రుల కలిసి సమన్వయంతో పనిచేయాలని మహేష్ గౌడ్ సూచించారు. చివరకు మంత్రి అడ్లూరికి పొన్నం క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసింది.