Phone Tapping Case: ప్రభాకర్ రావు కస్టడీ పొడిగింపు.. సుప్రీం ఆదేశం
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:19 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావు పోలీస్ కస్టడీని సుప్రీం కోర్టు పొడిగించింది. పోలీసుల విచారణకు సహకరించాలని ప్రభాకర్‌రావును ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ గడువును మరో వారం రోజుల పాటు పొడిగించింది సుప్రీం కోర్టు. డిసెంబర్ 25 వరకు కస్టోడియల్ విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కాగా.. నిన్నటి (గురువారం) ప్రభాకర్ రావు వారం రోజుల కస్టోడియల్ విచారణ పూర్తి అయిన విషయం తెలిసిందే. అయితే ట్యాపింగ్ కేసులో మరికొన్ని రోజులు విచారణ చేయాలని సుప్రీంకోర్టును సిట్ కోరింది. వారం రోజుల కస్టోడియల్ విచారణ రిపోర్ట్‌ను ఉన్నత న్యాయస్థానానికి సిట్ అందజేసింది.
దీంతో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణను వారం రోజుల పాటు పొడిగింపుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 26న పోలీస్ కస్టడీ నుంచి ప్రభాకర్ రావును విడుదల చేయాలని.. తదుపరి విచారణ వరకు ఎలాంటి వ్యతిరేక చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునేందుకు, అవసరమైన మందులు తీసుకునేందుకు ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.
కాగా.. కొత్త సిట్ ఏర్పాటుతో ట్యాపింగ్ కేసు మరింత వేగవంతంగా విచారణ జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ విచారణ కొనసాగనుంది. కొత్తగా ఏర్పాటు చేసిన సిట్‌లో 9 మంది అధికారులు ఉన్నారు. సీపీ సజ్జనార్‌తో పాటు రామగుండం సీపీ ఆంబరి కిషోర్ జా కూడా సిట్‌లో ఉన్నారు. గతంలో వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిద్ధిపేట సీపీ విజయ్ కుమార్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. మాదాపూర్ డీసీపీ రితి రాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డితో పాటు రవీందర్, వెంకట గిరి, కేఎస్ రావు, శ్రీధర్, నాగేందర్ రావుతో కొత్త సిట్ ఏర్పాటు అయ్యింది.
ఇవి కూడా చదవండి...
కలకలం సృష్టించిన చాక్లెట్లు.. 11 మంది విద్యార్థినులకు అస్వస్థత
హీరోయిన్ నిధి అగర్వాల్‌పై అసభ్య ప్రవర్తన.. పోలీసులు సీరియస్
Read Latest Telangana News And Telugu News