City Police: అమ్మో.. సైబర్ మోసాలు.. అప్రమత్తతే అసలైన మందు
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:04 AM
హైదరాబాద్ మహానగరంలో సైబర్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఎవరో ఒకరు, ఎక్కడో ఓ చోట ఈ మోసానికి బలవుతూనే ఉన్నారు. అయితే.. అప్రమత్తతే దీనికి అసలైన మందు అని, జాగ్రత్తలు పాటించాలని పోలీస్ శాఖ సూచిస్తోంది.
- వాడవాడలా పోలీసుల ముమ్మర ప్రచారం
- క్రిస్మస్, కొత్త సంవత్సర సంబరాల్లో జాగ్రత్త సుమా
హైదరాబాద్: సాంకేతికత ఎంత ఎదుగుతుందో, అంతే వేగంగా సాంకేతిక మోసాలు సైతం పెరుగుతూనే ఉన్నాయి. మన చుట్టూరా ఉన్న వాళ్లలోనే ఎవరో ఒకరు సైబర్ మోసాల బారిన పడుతూ ఆర్థికంగా క్షణాల్లో నష్టపోతున్నారు. అయ్యో అలాగా.. అనేలోపే మరొకరి వంతు వచ్చేస్తోంది. దీంతో సైబర్ క్రైం పోలీసులకు(Cyber Crime Police) రోజూ పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుండడంతో తలలు బాదుకుంటున్నారు. ఈ మోసాలను అరికట్టాలంటే ప్రజలను చైతన్యపరచడమే మార్గమని ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాడవాడలా పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
సైబర్ మోసాలు ఇలా..
నకిలీ కస్టమర్ కేర్ నంబర్లతో నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా, క్లాసిఫైడ్ సైట్లలో నకిలీ హెల్ప్‌లైన్ల నంబర్లు వేసి కస్టమర్లను ఆకర్షిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో పాటు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల సేవలంటూ ఫోన్లు చేసి కెడ్రిట్‌కార్డు లిమిట్ పెంచుతామని, కార్డు వివరాలు ఇవ్వాలని అడిగి మోసగిస్తారు. ఈ మెయిల్స్, ఎస్‌ఎంఎస్, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా నకిలీ పేమెంట్ పేజీల లింక్‌లు పెట్టి ఓటీపీ లేదా కార్డుల వివరాలు సేకరించి మోసం చేస్తున్నారు. దీంతోపాటు మెబైల్ ఫోన్‌ను ఆధీనంలోకి తీసుకొని ఓటీపీలు తమకు అందేలా చేసుకొని ఖాతాలను హ్యాక్ చేసుకొని పూర్తి మొత్తాన్ని డ్రా చేసుకుంటున్నారు. వీటితో పాటు పిషింగ్ లింక్‌లు, నకిలీ వెబ్ పేజీల ద్వారా, మాల్వేర్ యాప్, కార్డ్ స్కిమ్మింగ్, క్లోనింగ్, క్యాష్ బ్యాక్ స్కామ్ తదితర విధానాలతో మోసాలు చేసే అవకాశాలు ఉన్నాయి.
న్యూ ఇయర్ వేడుకలనూ వదలని కేటుగాళ్లు
సైబర్ మోసగాళ్లు క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మరింత రెచ్చిపోయే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. నకిలీ ఈవెంట్లు, పార్టీల పేరిట పబ్‌లు, రెస్టారెంట్లు, రిసార్స్ట్‌ల పేరుతో నకిలీ వెబ్‌సైట్ల ద్వారా తక్కకవ ధరకు పాస్‌లు అంటూ మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. ట్రావెల్స్, హాలిడే ప్యాకేజీల పేరిట భారీ ఆఫర్లు ప్రకటించి లింక్‌లు ఎస్‌ఎంఎ్‌సల ద్వారా పంపి ప్రాసెసింగ్ ఫీజులు, అడ్వాన్స్‌లంటూ మోసం చేసే అవకాశాలున్నాయి. వీటితో పాటు పర్యాటక పారంతాల్లో హోటళ్లు, రిసార్టులు బుక్ చేస్తామని నకిలీ వెబ్‌సైట్ల ద్వారా అడ్వాన్స్ పేమెంట్ల రూపంలో మోసగిస్తారని నిపుణులు చెబుతున్నారు.
అత్యాశే మోసాలకు దారి..
సైబర్ మోసాలు దాదాపు మనం వాడుతున్న సెల్‌ఫోన్లు, లాప్‌టా్‌పల ద్వారానే జరుగుతున్నాయి. అపరిచిత వ్యక్తులు పంపిన లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దు. మనకు తెలియని ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దు. గుర్తు తెలియని క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయవద్దు. చదువు లేని వారితో పాటు చదువుకున్న వారే ఎక్కువగా మోసపోతున్నారు. మన అత్యాశే సైబర్ మోసాలకు దారితీస్తున్నాయని గుర్తించాలి. ఆన్‌లైన్ లావాదేవీలు, వాట్సాప్ స్ర్కీన్ షేరింగ్‌లప్పుడు, ఏటీఎంల దగ్గర జాగ్రత్తలు తప్పనిసరి. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఆపర్లు ఇస్తే నమ్మకండి. మనం జాగ్రత్తగా ఉంటేనే మోసపోకుండా ఉండగలం.
సైదులు, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్, ఖైరతాబాద్
ఈ వార్తలు కూడా చదవండి..
కవితనే కాదు ఎవరైనా సీఎం కావొచ్చు
Read Latest Telangana News and National News