Chocolate Scare in Nandikotkur: కలకలం సృష్టించిన చాక్లెట్లు.. 11 మంది విద్యార్థినులకు అస్వస్థత
ABN , Publish Date - Dec 19 , 2025 | 09:16 AM
చాక్లెట్లు తిన్న 11 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన చాక్లెట్లు తినటంతో ఈ దారుణం చోటుచేసుకుంది. కనురెప్పలు నల్లగా మారటం, కడుపునొప్పి, వాంతులు మొదలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు.
నంద్యాల జిల్లాలో చాక్లెట్లు కలకలం సృష్టించాయి. చాక్లెట్లు తిన్న 11 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన చాక్లెట్లు తినటంతో ఈ దారుణం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నందికోట్కూరుకు చెందిన ఓ బాలిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. బాలిక స్కూలుకు వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బాలికకు చాక్లెట్ల ప్యాకెట్ ఇచ్చాడు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు పంపిణీ చేయాలని చెప్పాడు. ఆ బాలిక స్కూలు వెళ్లిన తర్వాత పీటీ టీచర్‌తో పాటు పలువురు విద్యార్థినులకు చాక్లెట్లను పంచింది.
ఆ చాక్లెట్లు తిన్న తర్వాత బాలికలు అస్వస్థతకు గురయ్యారు. కనురెప్పలు నల్లగా మారటం, కడుపునొప్పి, వాంతులు మొదలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం బాలికలు కోలుకున్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏడో తరగతి విద్యార్థినికి చాక్లెట్లు ఇచ్చిన ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు? బాలికకు ఎందుకు చాక్లెట్లు ఇచ్చాడు? అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇక, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం చెలరేగింది.
ఇవి కూడా చదవండి
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు.. స్థానిక పత్రికలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు
అయ్యో పాపం పసి పిల్లలు.. చెయ్యని తప్పుకు దారుణమైన శిక్ష..