MP Raghunandan Rao: జలమయమైన రామాయంపేట.. ఎంపీ రఘునందన్ పర్యటన
ABN , Publish Date - Aug 28 , 2025 | 01:56 PM
మెదక్ జిల్లా రామాయంపేటలోని వరద బాధిత ప్రాంతాల్లో ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. సిద్దిపేట - రామాయంపేట 765 డీజీ జాతీయ రహదారిపై నందిగామ వద్ద కల్వర్టు కుంగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు.
సిద్దిపేట: మెదక్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 30.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. హావేలిఘనాపూర్ మండలం సర్దనలో 30 సెంటీమీటర్ల కుండపోత వాన కురిసింది. నాగపూర్‌లో 27 సెం. మీ వర్షపాతం నమోదైంది. చేగుంటలో 22 సెం. మీ, రామయంపేట మండలంలో 20 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ మేరకు మెదక్ నుంచి బోధన్, బాన్స్‌వాడ వైపు బస్సు సర్వీసులు నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. రామాయంపేట మండలంలో వర్షం ధాటికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులపై భారీగా వరద వచ్చి చేరింది. దీంతో రాకపోకలు పూర్తిగా.. నిలిపోయాయి.
ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా రామాయంపేటలోని వరద బాధిత ప్రాంతాల్లో ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. సిద్దిపేట - రామాయంపేట 765 డీజీ జాతీయ రహదారిపై నందిగామ వద్ద కల్వర్టు కుంగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు. ఇక్కడ కొత్త బ్రిడ్జి కోసం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, నేషనల్ హైవే అథారిటీ అధికారులతో మాట్లాడానట్లు పేర్కొన్నారు. వరద ప్రవాహం తగ్గిన మరుక్షణం రాకపోకల పునరుద్ధరవకు చర్యలు చేపడుతామని స్పష్టం చేశారు. అలాగే బీబీపేట్ వద్ద రెండు చోట్ల జాతీయ రహదారి కొట్టుకుపోయిందని చెప్పారు. గత 20 ఏళ్లలో ఇలాంటి వర్షాలు ఎప్పుడూ చూడలేదని చెప్పుకొచ్చారు. మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ సూచన మేరకు అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతో ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రజలు ఎవరూ బయటకు రావద్దని ఆయన కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
స్వర్ణగిరి ఆలయ థీమ్‌తో బాలాపూర్ గణేష్ మండపం
తెలంగాణలో భారీ వర్షాలు.. జిల్లాల వారీగా హై అలర్ట్