Addanki Dayakar: ఎమ్మెల్సీల రద్దు సగం సమాచారం మాత్రమే.. అద్దంకి సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Aug 13 , 2025 | 08:56 PM
సుప్రీంకోర్టు పూర్తి వాదనలను వినడానికి సెప్టెంబర్ 17 తేదీని నిర్ణయించిందని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. ఆ రోజు తమకున్న సానుకూల అంశాలు సుప్రీంకోర్టుకు విన్నవిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 17 జరిగే ఫైనల్ హియరింగ్‌లో తమ వైపే న్యాయం ఉందని ప్రూవ్ చేయగలమని ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్: ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్‌ల విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయంపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు. కోదండరాం, అమీర్ అలీఖాన్‌ల ఎమ్మెల్సీ రద్దు అయినట్లు వచ్చిన సగం సమాచారంతో బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వారిద్దరి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ ప్రభుత్వం గమనిస్తుందని చెప్పుకొచ్చారు.
సుప్రీంకోర్టు పూర్తి వాదనలను వినడానికి సెప్టెంబర్ 17 తేదీని నిర్ణయించిందని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. ఆ రోజు తమకున్న సానుకూల అంశాలు న్యాయస్థానానికి విన్నవిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 17 జరిగే ఫైనల్ హియరింగ్‌లో తమ వైపే న్యాయం ఉందని ప్రూవ్ చేయగలమని ధీమా వ్యక్తం చేశారు. గత గవర్నర్ తిరస్కరించిన ఖాళీలను రెండు సంవత్సరాలు నింపకుండా తమ ప్రభుత్వం ఉండలేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. తమ ప్రపోజల్స్‌కు గవర్నర్ సానుకూల నిర్ణయం తీసుకున్నారని అద్దంకి దయాకర్ వివరించారు. వారిద్దరు ఎమ్మెల్సీలుగా అసెంబ్లీ, మండలిలో ప్రమాణ స్వీకారం చేశారని గుర్తు చేశారు. సభలో కూడా పాల్గొన్నారని పేర్కొన్నారు. వాటి అన్నింటిని తాము సుప్రీంకోర్టుకు వివరిస్తామని చెప్పారు. గతంలో కేసీఆర్ సరైన నియామకం చేయకపోవడం లేక సరైన పత్రాలు సమర్పించకపోవడంతో అప్పటి గవర్నర్ తమిళిసై ఆ ఎమ్మెల్సీలను తిరస్కరించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ లాగా కోర్టుకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా.. ఏ నియామకం చేయలేదని అద్దంకి స్పష్టం చేశారు.