Share News

Minister Sithakka: వారు ఆదివాసీ బిడ్డలను చంపుతున్నారు.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 09 , 2025 | 06:00 PM

ఆదివాసీల హక్కులు, అస్తిత్వం కోసం, ఆదివాసీలకు జరుగుతున్న మంచి చెడులను చర్చించుకునేందుకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఒక మంచి వేదిక మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా జాతి గొప్పతనం, మూలాలు, సంస్కృతి జీవన విధానాలను ఎప్పుడు మర్చిపోకుండా కాపాడుకోవాలి ఆమె సూచించారు.

Minister Sithakka: వారు ఆదివాసీ బిడ్డలను చంపుతున్నారు.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
Minister Seethakka

హైదరాబాద్: విద్య ద్వారానే విముక్తి సాధ్యమవుతుందని మంత్రి సీతక్క తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ సాంస్కృతిక సంఘం, ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం, ఆదివాసీ మహిళా చైతన్య శక్తి ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా సీతక్క హాజరై మీడియాతో మాట్లాడారు.


మన మూలాలు కాపాడుకోవాలి..

ఆదివాసీల హక్కులు, అస్తిత్వం కోసం, ఆదివాసీలకు జరుగుతున్న మంచి చెడులను చర్చించుకునేందుకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఒక మంచి వేదిక మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా జాతి గొప్పతనం, మూలాలు, సంస్కృతి జీవన విధానాలను ఎప్పుడు మర్చిపోకుండా కాపాడుకోవాలి ఆమె సూచించారు. మన మూలాలు ఉంటే మనకు అస్తిత్వమని తెలిపారు. అందుకే మన మూలాలను కాపాడుకోవాలన్నారు.


హక్కులను తెలియజేయండి..

దేశంలో భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని సీతక్క చెప్పారు. రాజ్యాంగం లేకపోతే మనకు రాజ్యాంగ ఫలాలు అందవని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు అటవీ ప్రాంతాల్లో నీళ్లు, నిధులు అడవులను ఆక్రమిస్తున్నాయని మండిపడ్డారు. ఆ విషయాన్ని ప్రశ్నిస్తే ఆదివాసీ బిడ్డలను చంపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కులు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి హక్కులను తెలియజేయాల్సిన బాధ్యత ఆదివాసీ విద్యార్థి, ఉద్యోగ సంఘాలదే అని ఆమె సూచించారు.


ఆదివాసీ చరిత్రను రికార్టు చేయండి..

తాను ఈ స్థాయిలోకి రావడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు. ఎన్ని సమస్యలున్నా తాను విద్యను ఆపలేదని గుర్తు చేశారు. అందుకే విద్యా రంగంలో ఆదివాసీలు రాణించాలని హితవు పలికారు. ఎదిగి వచ్చిన ఆదివాసీ బిడ్డలు తోటి సమాజం కోసం కొంత సమయాన్ని వెచ్చించాలన్నారు. మీతో కలిసి నడవడానికి సిద్ధంగానే ఉంటామని పేర్కొన్నారు. ఆదివాసీ చరిత్రను తవ్వండి, పురాతన ఆనవాలను గుర్తించండి, మన చరిత్ర రికార్డ్ చేయండని ఉద్ఘాటించారు. అప్పుడే మన సంస్కృతిని భవిష్యత్ తరాలకు బలంగా తెలియజేయగలమని చెప్పుకొచ్చింది. ప్రకృతి మీద ఆధారపడి ఎదిగే జాతి మనది. ఈ ప్రత్యేకతను మనం కాపాడుకోవాలని అని తెలిపారు. మన జాతులు అంతరించి పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని మంత్రి సీతక్క స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

గువ్వల రాజీనామా.. స్పందించిన బీఆర్ఎస్

తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు

Updated Date - Aug 09 , 2025 | 06:00 PM