Minister Ponguleti Srinivas: భూముల కేటాయింపులపై లెక్కలు తేల్చాలి..
ABN , Publish Date - Oct 06 , 2025 | 02:41 PM
అటవీ శాఖకు రెవెన్యూ శాఖ ఇచ్చిన భూమి, అలాగే అటవీ శాఖ రెవెన్యూ శాఖకు ఇచ్చిన భూమిపై వివరాలను రెండు శాఖలు కలిసి నివేదిక ఇవ్వాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.
హైదరాబాద్: సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ భూసేకరణపై అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రెవెన్యూ భూముల కేటాయింపులపై లెక్కలు తేల్చాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ భూసేకరణ వేగవంతం చేయాలని సూచించారు. గత 30-40 సంవత్సరాలుగా రెవెన్యూ శాఖ తరఫున వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించిన భూముల వివరాలు, వినియోగం, ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. రాష్ట్ర విభజన తర్వాత పలు ప్రాజెక్టుల్లో మార్పులు, రద్దులు జరిగిన నేపథ్యంలో వాటి లెక్కలు చూపాలని ఆయన పేర్కొన్నారు.
అటవీ శాఖకు రెవెన్యూ శాఖ ఇచ్చిన భూమి, అలాగే అటవీ శాఖ రెవెన్యూ శాఖకు ఇచ్చిన భూములపై వివరాలను రెండు శాఖలు కలిసి నివేదిక ఇవ్వాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1138 ఎకరాల అటవీ భూమి కేటాయింపును వేగవంతం చేయాలని తెలిపారు.
కేశవపురం త్రాగునీటి పథకం కోసం గతంలో కేటాయించిన 1030 ఎకరాల భూమి ప్రాజెక్ట్ రద్దు చేశారని గుర్తు చేశారు. ఆ భూమిని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు బదిలీ చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి, అటవీ పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పీసీసీఎఫ్, మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు