Rachakonda Drug Bust: డ్రగ్స్ కొన్నా, అమ్మినా ఇక అంతే.. రాచకొండ సీపీ హెచ్చరిక
ABN , Publish Date - Oct 10 , 2025 | 03:52 PM
ఉదయ్‌పూర్‌లోని గోల్డెన్ పామ్ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేశాడని.. మేనేజ్‌మెంట్ మార్పుల కారణంగా లోకేష్ బరేత్ ఉద్యోగం కోల్పోయినట్లు రాచకొండ సీపీ వెల్లడించారు. ఉద్యోగం లేకపోవడంతో జగదీష్ గుజ్జర్‌ను కలిశాడని.. అప్పటికే జగదీష్ గుజ్జర్ డ్రగ్స్ సరఫరా చేసేవాడన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 10: రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. కోటి రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ గుట్టు రట్టుపై రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ అమ్ముతున్న లోకేష్ బరేత్‌ను (26) అరెస్ట్ చేశామని.. అతడు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాడని తెలిపారు. ఈ కేసులో రెండో నిందితుడు జగదీష్ గుజ్జర్ అని.. అతడు కూడా రాజస్థానికి చెందిన వాడని.. ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు చెప్పారు. లోకేష్ బరేత్ 10వ తరగతి వరకు చదివి, టెక్స్టైల్ షాప్‌లో సేల్స్ బాయ్‌గా తరువాత డొమినోస్ పిజ్జాలో డెలివరీ బాయ్‌గా పనిచేశాడని తెలిపారు.
తరువాత హౌస్ కీపింగ్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేశాడన్నారు. ఉదయ్‌పూర్‌లోని గోల్డెన్ పామ్ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేశాడని.. మేనేజ్‌మెంట్ మార్పుల కారణంగా లోకేష్ బరేత్ ఉద్యోగం కోల్పోయినట్లు వెల్లడించారు. ఉద్యోగం లేకపోవడంతో జగదీష్ గుజ్జర్‌ను కలిశాడని.. అప్పటికే జగదీష్ గుజ్జర్ డ్రగ్స్ సరఫరా చేసేవాడన్నారు. జగదీష్ గుజ్జర్‌తో కలిసి అక్రమంగా ఓపియం రవాణా, విక్రయ వ్యాపారం ప్రారంభించాడన్నారు.
ఎవరికి ఎప్పుడు ఇవ్వాలి అనే విషయం లోకేష్ బరేత్‌కు జగదీష్ గుజ్జర్ చెప్పేవాడని సీపీ తెలిపారు. నిందితులు రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు ట్రైన్‌లో 7 కిలోల ఓపియం, 2 కిలోల పాపీ స్ట్రా తెచ్చారన్నారు. అక్టోబర్ 10, 2025న కీసరా పోలీసు పరిధిలో పట్టుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ 1 కోటి ఉంటుందన్నారు. ప్రస్తుతం జగదీష్ గుజ్జర్ పరారీలో ఉన్నాడని.. త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. 10 నెలల్లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ అమ్మేవాళ్లు.. కొనేవాళ్లు కలిపి 403 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. డ్రగ్స్ కొనేవాళ్లు, సరఫరా చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని రాచకొండ సీపీ సుధీర్ బాబు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
ప్రజలు తిరగబడతారనే తెరపైకి రిజర్వేషన్ల అంశం: ఎర్రబెల్లి దయాకర్
అందరూ కలిసి ఓడగొట్టారు.. అంజన్ ఆవేదన
Read Latest Telangana News And Telugu News