Mahindra University Drugs Case: డ్రగ్స్ కేసులో.. మహీంద్రా యూనివర్సిటీ కీలక ప్రకటన
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:18 AM
మహీంద్రా యూనివర్సిటీలో జరిగిన డ్రగ్స్ కేసుకు సంబంధించి యూనివర్సిటీ కీలక ప్రకటన విడుదల చేసింది. 'మహీంద్రా యూనివర్సిటీ జీరో టాలరెన్స్ పాలసీ ను అనుసరిస్తుంది. చట్టాన్ని ఉల్లంఘించే లేదా మా విద్యార్థి సమాజం భద్రత, సంక్షేమాన్ని ప్రమాదంలోకి నెట్టే ఏ చర్యకైనా...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన మల్నాడు రెస్టారెంట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రెస్టారెంట్ యజమాని ఇచ్చిన సమాచారం మేరకు మహీంద్రా యూనివర్సిటీలో అధికారులు తనిఖీ చేయగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో మహీంద్రా యూనివర్సిటీ కీలక ప్రకటన విడుదల చేసింది. 'మహీంద్రా యూనివర్సిటీలో, మేము క్రమశిక్షణ, నిజాయితీ, చట్టానికి గౌరవం వంటి అత్యున్నత ప్రమాణాలను పాటిస్తాము. ఇటీవల కొంతమంది విద్యార్థులకు నార్కోటిక్స్ కేసులో ప్రమేయముందని వెలువడిన పరిణామాలపై మేము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. మత్తుపదార్థాల వినియోగం, కలిగి ఉండటం లేదా పంపిణీ చేయడాన్ని విశ్వవిద్యాలయం ఖండిస్తుంది'.
'మహీంద్రా యూనివర్సిటీ జీరో టాలరెన్స్ పాలసీని అనుసరిస్తుంది. చట్టాన్ని ఉల్లంఘించే, మా విద్యార్థి సమాజం భద్రత, సంక్షేమాన్ని ప్రమాదంలోకి నెట్టే ఏ చర్యకైనా విశ్వవిద్యాలయ నియమావళి, వర్తించే చట్టపరమైన నిబంధనల ప్రకారం కఠినమైన శిక్షలు విధించబడతాయి. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు పూర్తిగా సహకరించాము. సమస్య వేగంగా, సముచితంగా పరిష్కారమయ్యేలా అన్ని విధాల సహాయాన్ని అందించాము. మా సంస్థ విలువలు, సమగ్రతను కాపాడటానికి అవసరమైన ప్రతి చర్య తీసుకుంటూ, సురక్షితమైన, బాధ్యతాయుతమైన, క్రమశిక్షణతో కూడిన క్యాంపస్ వాతావరణాన్ని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నాము. ప్రతి విద్యార్థి అభివృద్ధి చెందగల సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి అంకితభావంతో ఉన్నాము. ఉన్నత విద్యాసంస్థగా, మత్తుపదార్థాల వినియోగ ప్రమాదాలు, చట్టపాలన ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మా విధానాలు, కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తాము. విద్యార్థులు బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకుని మహీంద్రా యూనివర్సిటీ ప్రతిపాదించే విలువలను కాపాడాలని కోరుకుంటున్నాము.’ అని మహీంద్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. యాజులు మేడూరి ఓ ప్రకటనలో చెప్పుకొచ్చారు.
Also Read:
ఖర్జూరం మాత్రమే కాదు.. దాని విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఒక వరం..!
ఒక్కసారి ఇలా చేస్తే.. కడుపులోని గ్యాస్ మొత్తం బయటకు వస్తుందట!