Konda Surekha: నాన్ బెయిలబుల్ వారెంట్‌పై కొండా సురేఖ రియాక్షన్
ABN , Publish Date - Dec 11 , 2025 | 08:29 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్లు తనపై జరుగుతున్న ప్రచారంపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు.
హైదరాబాద్, డిసెంబర్ 11: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్లు తనపై జరుగుతున్న ప్రచారంపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. కొన్ని పత్రికలు, ఛానళ్లు, వెబ్ సైట్లలో తనకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం అని ఆమె గురువారం హదరాబాద్‌లో స్పష్టం చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ.. ఫిబ్రవరి 5వ తేదీన ఉందన్నారు. ఆ రోజు జరిగే విచారణకు హాజరుకావాలని కోర్టు తనకు స్పష్టం చేసిందన్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు.
గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ విమర్శలు చేశారు. ఈ సందర్భంగా హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత విడాకులపై ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇవి తీవ్ర వివాదాస్పదమైనాయి. దీంతో నాంపల్లిలోని ప్రత్యేక కోర్టును మాజీ మంత్రి కేటీఆర్, హీరో నాగార్జున అక్కినేని వేర్వేరుగా పరువునష్టం దావా వేశారు.
ఈ నేపథ్యంలో హీరో నాగార్జునకు మంత్రి కొండా సురేఖ ఇటీవల క్షమాపణలు చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఎటువంటి దురుద్దేశ్యంతో చేసినవి కావంటూ వివరణ ఇచ్చారు. దాంతో నాగార్జున.. నాంపల్లిలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. దీంతో వారిద్దరి మధ్య ఉన్న వివాదం కాస్తా సమసిపోయింది. కానీ మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా మాత్రం విచారణ జరుగుతుంది. ఆ క్రమంలో గురువారం సైతం నాంపల్లి కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది.
ఈ విచారణకు మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసును 2026, ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజు విచారణకు హాజరుకావాలంటూ సురేఖకు కోర్టు స్పష్టం చేశారు. అయితే మంత్రి కొండా సురేఖ కోర్టుకు గైర్హాజరు కావడంతో.. ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందంటూ మీడియా, సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. దీంతో మంత్రి కొండా సురేఖ ఈ కథనాలను ఖండించారు. అందులో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. తదుపరి కేసు విచారణకు హాజరు కావాలని కోర్టు తనకు స్పష్టం చేసిదంటూ వివరణ ఇచ్చారు.
ఈ వార్త కూడా చదవండి..
వారణాసి వెళ్తున్నారా.. గుడ్ న్యూస్
అఖండ - 2 మేకర్స్‌కి మరో ఎదురు దెబ్బ.. హైకోర్టులో కేసు..
Read Latest TG News and National News