Akhanda 2: అఖండ - 2 మేకర్స్‌కి మరో ఎదురు దెబ్బ.. హైకోర్టులో కేసు..
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:26 PM
బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం 'అఖండ 2: తాండవం'. ఈ మూవీ రిలీజ్ విషయంలో ఎన్నో అవాంతరాలు వాటిల్లాయి. అన్ని ఓకే అనుకున్న తర్వాత మూవీ మేకర్స్‌కి మరో షాక్ తగిలింది.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2: తాండవం’ మూవీ రిలీజ్ డేట్ ఏ మూహూర్తంలో ప్రకటించారో కానీ.. వరుసగా అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి హై కోర్టు మరో షాక్ ఇచ్చింది. మరికొన్ని గంటల్లో మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా.. ప్రీమియం షోకు ధరల పెంపుపై ప్రభుత్వ జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. అంతే కాదు ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు, సినీ నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. ఇటీవల రేవంత్ సర్కార్ స్పెషల్ షోతో పాటు టికెట్లు ధరలు పెంచుతూ జారీ చేసిన జీవోను కోర్టు రద్దు చేసింది.
అఖండ -2 మూవీకి డిసెంబర్ 12 నుంచి 14 వ తేదీ వరకు టికెట్ ధరలు పెంచుకోవచ్చునని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులు ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లో టికెట్ పై రూ.50, మల్టీఫ్లెక్స్‌లో రూ.100 అదనంగా వసూలు చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. అలాగే డిసెంబర్ 11వ తేదీన ప్రీమియర్ షో టికెట్ ధరను రూ. 600గా నిర్ణయించేందుకు సర్కార్ అంగీకరించింది.
కాకపోతే టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చే లాభాల్లో 20 శాతాన్ని సినీ కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాల్సిందిగా మూవీ మేకర్స్‌కి షరతు విధించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలంటూ హైకోర్టును అడ్వకేట్ ఆశ్రయించడం.. ఈ పిటిషన్‌పై విచారణ జరగడం ఆసక్తిగా మారింది.
వాస్తవానికి ఈ మూవీ డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. అయితే.. ఈ మూవీపై స్టే విధిస్తూ తీర్పు ఇచ్చింది చెన్నై హై కోర్టు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ తమకు 14 రీల్స్ సంస్థ నుంచి నగదు రావాల్సి ఉందని.. అది క్లీయర్ అయ్యే వరకు ఈ చిత్రం విడుదలను అడ్డుకుంటామని పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుధీర్ఘ విచారణ తర్వాత ఈరోస్ మూవీ రిలీజ్‌కు అనుమతి ఇచ్చింది. మొత్తానికి ఈ చిత్రం రేపు.. అంటే శుక్రవారం భారీ అంచనాలతో విడుదల కానుంది. దీంతో మూవీ మేకర్స్‌కు మరో ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది.