Kishan Reddy Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు ఖాయం: కిషన్ రెడ్డి
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:35 PM
బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయని కిషన్ రెడ్డి అన్నారు. నాడు కేసీఆర్ పాలనలో మజ్లీస్ పార్టీ భుజాల మీద మోశారని.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తోందని తెలిపారు. ఈ మూడు పార్టీలు ఒక్కటే అంటూ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 16: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్రంలో ఒక చర్చనీయాంశంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Central Minister Kishan Reddy) అన్నారు. గురువారం ఎర్రగడ్డ డివిజన్ బూత్ అధ్యక్షులు, కార్యకర్తలతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఈ ఎన్నికను ఎవరూ కోరుకున్నది కాదని.. స్థానిక శాసనసభ్యులు స్వర్గస్థులు కావడం వల్ల ఈ ఎన్నికలు వచ్చాయన్నారు. ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయాలలో మార్పు తెచ్చే ఎన్నిక అని చెప్పుకొచ్చారు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్, పదేళ్లకుపైగా కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్.. జూబ్లీహిల్స్‌ను ఏమాత్రం పట్టించుకోవడం లేదని వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా డ్రైనేజీ పొంగిపొర్లుతోందని.. ఎక్కడ చూసినా చెత్తాచెదారంగా మారిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలించేది కాంగ్రెస్ కాదని.. మజ్లిస్ పార్టీ అంటూ దుయ్యబట్టారు.
ఆ మూడు కుటుంబ పార్టీలే...
పాతబస్తీలో మజ్లీస్ గుండాల కారణంగా చాలా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయన్నారు. నాడు కేసీఆర్ పాలనలో మజ్లీస్ పార్టీ భుజాల మీద మోశారని.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తోందని తెలిపారు. ఈ మూడు పార్టీలు ఒక్కటే అంటూ వ్యాఖ్యలు చేశారు. వీరందరూ కలిసి బీజేపీ పార్టీని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో బీఆర్‌ఎస్ పార్టీ నేతలు మంత్రి పదవులు అనుభవించారని గుర్తు చేశారు. ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలే అని.. వారి కోసమే పని చేస్తాయని విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని పరోక్షంగా మజ్లీస్ పార్టీ ఏలాలని చూస్తోందన్నారు. జూబ్లీహిల్స్‌ను మజ్లీస్ పార్టీకి అప్పజెప్పొద్దన్నారు సెంట్రల్ మినిస్టర్.
హామీలు ఏమయ్యాయి?..
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500, మోటార్ సైకిళ్లు, తులం బంగారం ఏమయ్యాయని నిలదీశారు. కాంగ్రెస్ నాయకులు విపరీతమైన దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు ఇస్తామన్న రూ.4,000 ఏమయ్యాయని అడిగారు కేంద్రమంత్రి. వీటిపై యువకులు, మహిళలు కాంగ్రెస్‌ను నిలదీయాలన్నారు. ఇప్పటికి ఒక్కరికి కూడా కొత్త పెన్షన్ ఇవ్వలేదన్నారు. బీసీలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఇస్తామన్న లక్ష కోట్లు ఏమయ్యాయని.. ఎందుకు ఇవ్వలేదో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షలు ఇస్తామన్నారని, ఇచ్చారా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఏ హామీని కూడా నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనీసం స్ట్రీట్ లైట్లు కూడా వేయలేదని కేంద్రమంత్రి మండిపడ్డారు.
వారికి ఓటేస్తే మజ్జిస్‌కు వేసినట్టే..
ముఖ్యమంత్రి తిరిగే రూట్లలో కూడా స్ట్రీట్ లైట్లు లేవన్నారు. తెలంగాణలో బీజేపీ ఎదగకుండా అధికార పార్టీతో కలిసి మజ్లీస్ పార్టీ ప్రయత్నిస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది మజ్లీస్ పార్టీకి వేసినట్టే అని అన్నారు. బీఆర్‌ఎస్‌కు తెలంగాణలో భవిష్యత్ లేదని.. ఆ పార్టీకి ఓటు వేస్తే మూసీలో వేసినట్టే అంటూ కామెంట్స్ చేశారు. బీజేపీ కార్యకర్తలు నవంబర్ 11 వరకు నిబద్ధతతో పని చేయాలని.. ప్రజల మధ్యలో పని చేయాలని సూచించారు. బీజేపీ అభ్యర్థి దీపక్ ప్రజల మధ్యలో ఉన్న నాయకుడన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో చురుకుగా పని చేశారన్నారు. బీజేపీ అభ్యర్థి అయిన దీపక్ కోసం పని చేయాలని.. కార్యకర్తలం అందరం కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. మజ్లీస్ పార్టీ కబంధ హస్తాల నుంచి హైదరాబాద్‌ను రక్షించుకోవాలన్నారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా జూబ్లీహిల్స్‌లో న్యాయం గెలవాలని.. ప్రజలే గెలవాలని తెలిపారు. పేద ప్రజలకు బీజేపీ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వెల్లడించారు. అందరికీ ఉచిత బియ్యాన్ని అందిస్తోందన్నారు. దేశానికి ప్రధాన మంత్రి మోదీ ప్రపంచ వ్యాప్తంగా పేరు తీసుకొచ్చారని.. పేదల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రెచ్చిపోయిన సైకో.. తల్లిదండ్రులపైనే
నవీద్ యాదవ్‌ను గెలిపిస్తే జరిగేది ఇదే అన్న పీసీసీ చీఫ్
Read Latest Telangana News And Telugu News