Share News

Kishan Reddy Sardar Patel: సర్దార్ స్ఫూర్తితోనే మోడీ ముందడుగు: కిషన్ రెడ్డి

ABN , Publish Date - Oct 31 , 2025 | 11:17 AM

పటేల్ చొరవతోనే తెలంగాణలో మూడు రంగుల జెండా ఎగిరిందని కిషన్ రెడ్డి తెలిపారు. నిజాం నిరంకుశత్వంపై ఉక్కు పాదం మోపిన ఘనుడు పటేల్ అని పేర్కొన్నారు.

Kishan Reddy Sardar Patel: సర్దార్ స్ఫూర్తితోనే మోడీ ముందడుగు: కిషన్ రెడ్డి
Kishan Reddy Sardar Patel

హైదరాబాద్, అక్టోబర్ 31: ఏడాది పాటుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabahai Patel) ఉత్సవాలు జరుపుతామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Ministr Kishan Reddy) తెలిపారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. పటేల్ రాజకీయ నేత కాదు రైతాంగ ఉద్యమ నేత అని చెప్పుకొచ్చారు. సర్దార్ పటేల్ అంటే కాంగ్రెస్ పార్టికి నొప్పి అని.. పీవీ నరసింహారావు అంటే కాంగ్రెస్‌కు నచ్చదంటూ వ్యాఖ్యలు చేశారు. కేవలం నెహ్రూ కుటుంబమే కాంగ్రెస్‌కు నచ్చుతుందన్నారు. కాంగ్రెస్‌కు దేశమంటే నెహ్రూ, నెహ్రూ అంటే దేశమని.. నెహ్రూ తప్ప కాంగ్రెస్‌కు ఎవ్వరూ అవసరం లేదని విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది అంటూ విరుచుకుపడ్డారు. పటేల్‌ను వెన్నుపోటు పొడిచిన చరిత్ర కాంగ్రెస్ ది అంటూ ఆరోపించారు. పటేల్‌ను తెలంగాణ బిడ్డలు ఎవరూ మర్చిపోరని.. సర్దార్ చేసిన త్యాగమే తెలంగాణ అని చెప్పుకొచ్చారు.


పటేల్ చొరవతోనే తెలంగాణలో మూడు రంగుల జెండా ఎగిరిందని కేంద్రమంత్రి తెలిపారు. నిజాం నిరంకుశత్వంపై ఉక్కు పాదం మోపిన ఘనుడు పటేల్ అని పేర్కొన్నారు. నిజాం మెడలు వంచి తెలంగాణ గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరవేశారన్నారు. ఈ ఏడాది అంతా పటేల్ 150 జయంతి ఉత్సవాలను తెలంగాణలో ప్రతి ఇంట్లో ఘనంగా జరుపుకోవాలని కోరారు. ఆయన స్ఫూర్తిని గుర్తు చేసుకోవాలన్నారు. ప్రతి పౌరుడు పటేల్ చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. సర్దార్ స్పూర్తితో ప్రధాని మోడీ అడుగులు వేస్తున్నారని.. వికసిత భారత్ లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.


ఉక్కు నేత పటేల్: లక్ష్మణ్

ఉక్కు సంకల్పంతో నిజాం మెడలు వంచిన ఘనుడు పటేల్ అని రాజ్యసభ సభ్యు లక్ష్మణ్ అన్నారు. దేశ ఐక్యత కోసం కృషి చేసిన ఉక్కు నేత పటేల్ అని కొనియాడారు. సర్దార్‌ను గౌరవించడానికి కూడా కొన్ని పార్టీలు ఇష్టపడటం లేదని విమర్శించారు. యువతకు స్ఫూర్తిగా అతిపెద్ద పటేల్ విగ్రహాన్ని నిర్మించిన ఘనత మోడీది అని చెప్పుకొచ్చారు. దేశానికి పటేల్ స్పూర్తిగా కావాలని లక్ష్మణ్ ఆకాంక్షించారు.


అది పటేల్ త్యాగఫలితమే: ఏలేటి

పటేల్ చరిత్రను కనుమరుగు చేశారని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. దేశ సమగ్రత కోసం పాటు పడిన వ్యక్తి పటేల్ అని అన్నారు. ఇవాళ స్వేచ్చా వాయువులు పిలుస్తున్నామంటే పటేల్ త్యాగఫలితమే అని తెలిపారు. నగరంలో అతిపెద్ద పటేల్ విగ్రహాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

డీప్‌ఫేక్ పెద్ద గొడ్డలిపెట్టు.. అడ్డుకోవాల్సిందే: చిరంజీవి

ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. నేటితో ముగియనున్న గడువు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 31 , 2025 | 11:43 AM