KCR Press Meet: ‘నేనే వస్తా’.. రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్..
ABN , Publish Date - Dec 21 , 2025 | 07:55 PM
చాలా కాలం తరువాత మీడియా ముందుకు వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అంటూ కాంగ్రెస్ సర్కార్‌కి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో..
హైదరాబాద్, డిసెంబర్ 21: చాలా కాలం తరువాత మీడియా ముందుకు వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అంటూ కాంగ్రెస్ సర్కార్‌కి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన కేసీఆర్.. కాంగ్రెస్ సర్కార్‌పై డైరెక్ట్ వార్ ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయని.. తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. రెండేళ్లు ఆగామని.. ఇకపై ప్రభుత్వాన్ని అడుగడునా నిలదీస్తామన్నారు. బహిరంగ సభలు పెడతామని.. జనంలోకి తానే నేరుగా వస్తానని ప్రకటించారు. ఇకపై రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని కేసీఆర్ ప్రకటించారు. ఇంట్లోకి వచ్చి దోచుకుపోతామంటే ఊరుకుంటామా? అని ప్రశ్నించారు.
ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందాలే తప్ప.. వేరే ధ్యాసే లేదని కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. సర్కార్ విధానాలను ఎక్కడికక్కడ నిలదీస్తామని.. అన్యాయాలపై ప్రశ్నిస్తామన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లు కొనే దిక్కు లేదు.. యూరియా ఇచ్చే సిస్టమ్ లేదని రేవంత్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆగమాగం చేస్తుందన్నారు. వీరి పాలనా విధానాలు గమనిస్తుంటే.. అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉందా? నిద్రపోతుందా? అనే అనుమానం కలుగుతోందన్నారు. ఎంతసేపు భూములు అమ్ముకుందామనే యావలోనే ఉంటే ఎలా? అంటూ కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడతామని, ఉద్యమాలు చేపడతామన్నారు. భారీ బహిరంగ సభలు పెడతామని.. తాను ఆ సభకు హాజరవుతానని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. ప్రభుత్వం నోరుమూసుకుని ఉంటుందని.. అందుకే తాము ముందడుగు వేస్తామన్నారు.
‘ఇవాళ్టి వరకు ఒక లెక్క.. రేపటి నుంచి మరో లెక్క.. ఎక్కడికక్కడ నిలదీస్తా.. తోలు తీస్తాం. మొదటికే ముప్పు వచ్చే పరిస్థితి ఉంది. మేం ఉద్యమించక తప్పదు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సర్వభ్రష్ట ప్రభుత్వం. జలదోపిడీ విషయంలో పోరాటాలు చేస్తాం. రాష్ట్ర హక్కును రక్షించుకోవడానికి ఫైట్ చేస్తాం. కళ్ల ముందు ఇదంతా జరుగుతుంటే మౌనంగా ఉండాలి, ఇష్టానుసారం మాట్లాడుతామంటే కుదరదు. ఇక నుంచి ప్రత్యక్ష పోరాటం చేస్తాం’ అని కేసీఆర్ రాజకీయ యుద్ధం ప్రకటించారు.
Also Read:
ఆగని హింస, బీఎన్‌పీ నేత ఇంటికి నిప్పు.. ఏడేళ్ల కుమార్తె సజీవదహనం
హామీలపై చర్చకు సిద్ధమా.. కిషన్‌రెడ్డికి జగ్గారెడ్డి స్ట్రాంగ్ ఛాలెంజ్
టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎవరిదంటే?